ఈసారి బీజేపీ, సేన కలిసే పోటీ

ఈసారి బీజేపీ, సేన కలిసే పోటీ
  • త్వరలోనే సీట్ల సర్దుబాటుపై
  • క్లారిటీ: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
  • నేటి నుంచి 31 దాకా ‘మహాజనాదేశ్ యాత్ర’

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ, శివసేన పార్టీలు కలిసి పోటీచేస్తాయని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. కలిసొచ్చే ఇతర పార్టీలను కూడా కూటమిలో చేర్చుకుంటామని, సీట్ల సర్దుబాటుపై త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు.  ప్రతిపక్ష ఎన్సీపీ– కాంగ్రెస్ కూటమిని దెబ్బతీసేలా అధికార కూటమిలోని బీజేపీ, శివసేన పార్టీలు విడివిడిగా పోటీ చేయబోతున్నాయన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్​కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం బీజేపీలో చేరిన సందర్భంగా ముంబైలో ఏర్పాటుచేసిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీకి 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీచేశాయి. ఫలితాల తర్వాత కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. నాటి ఎన్నికల్లో బీజేపీకి 122, శివసేన 63 సీట్లు గెల్చుకోగా, ప్రతిపక్ష కూటమికి చెందిన కాంగ్రెస్​ 42, ఎన్సీపీ 41 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్​, ఎన్సీపీల మధ్య ఇప్పటికే సీట్ల పంపకాలూ పూర్తయ్యాయి.

రికార్డు బ్రేక్​ చేస్తాం: ఫడ్నవీస్​

బీజేపీ, శివసేన కలిసి పోటీచేయడం ద్వారా రికార్డు స్థాయిలో అసెంబ్లీ సీట్లు గెల్చుకుంటామని సీఎం ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. స్టేట్​ బీజేపీ ప్రెసిడెంట్​ చంద్రకాంత్​ పాటిల్​తో కలిసి.. ఎన్సీపీ, కాంగ్రెస్​కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు సీఎం కాషాయకండువా కప్పారు. ఈసారి ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్న సీఎం ఫడ్నవీస్ ‘మహాజనాదేశ్​ యాత్ర’ పేరుతో భారీ యాత్రకు రెడీ అయ్యారు. గురువారం అమరావతి జిల్లాలో ప్రారంభం కానున్న ఈ యాత్ర.. ఈ నెల 31న నాసిక్​లో ముగుస్తుంది. కొత్తగా పార్టీలో చేరిన ఈ నలుగురు ఎమ్మెల్యేలూ 2019 ఎన్నికల్లో అవే నియోజకవర్గాల నుంచి కమలం గుర్తుపై పోటీచేస్తారని బీజేపీ నేతలు చెప్పారు.