కేసీఆర్.. కళ్లు ఉన్న కబోధి: రఘునందన్ రావు

కేసీఆర్.. కళ్లు ఉన్న కబోధి: రఘునందన్ రావు

నాటి ధృతరాష్ట్రుడి పాలనలో ద్రౌపదికి జరిగిన అన్యాయం నేడు తెలంగాణలో మహిళ ఆర్టీసీ కార్మికురాళ్లకు జరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తమ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని గత 6 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోలోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికులు యత్నించారు. దీంతో పోలీసులకు, ఆర్టీసి కార్మికులకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు రఘునందన్ రావు సంఘీభావం తెలిపారు. శుక్రవారం ప్రజ్ఞాపూర్ లో సమ్మె చేస్తున్న కార్మికులకు మద్ధతుగా ఆయన మాట్లాడారు

గురువారం ఈ సమ్మెలో పాల్గోన్న  ఆర్టీసీ మహిళా ఉద్యోగులపై పోలీసులు కాస్త అతిగా ప్రవర్తించడంపై రఘనందన్ మండిపడ్డారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు . మహిళ హక్కులను కాలరాసి,దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారుల అందరిపైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం మహిళలను వేధిస్తే ఏ శిక్షను వేస్తారో ఆ శిక్షను వెంటనే వారికి వేయాలన్నారు.

రాష్ట్రంలో ధృతరాష్ట్రుని పాలన సాగుతుందని, సీఎం కేసీఆర్ కళ్ళు ఉన్న కబోధిలా ప్రవర్తిస్తున్నాడని రఘునందన్ అన్నారు.  ఉద్యోగ సంఘాల నాయకుడిగా చెలామణి అయిన శ్రీనివాస్ గౌడ్.. నేడు మంత్రి పదవి రాగానే ఉద్యోగ సంఘాలను ఆర్టీసీ సంఘాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఇంట్లోకి తీసుకొనిపోయి భోజనాలు ఏర్పాట్లు చేసి, కార్మిక సంఘాలలో చీలిక తేవడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. మంత్రి పదవి కోసం కార్మిక సంఘాల భవిష్యత్ ను నాశనం చేయొద్దని రఘునందన్ రావు శ్రీనివాస్ గౌడ్ ని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాలు, కార్మికులు ఐక్యంగా ఉండాలని, ఈ ఉద్యమాన్ని ఎంతవరకైనా తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున తాము ఎల్లప్పుడూ ఆర్టీసీ కార్మికులకు సహకరిస్తామని అన్నారు.

BJP spokes person Raghunandan Rao solidarity for the RTC employees strike