కమీషన్ ఇవ్వడం లేదనే హరీష్ రావు శాఖ మార్చేశాడు

కమీషన్ ఇవ్వడం లేదనే హరీష్ రావు శాఖ మార్చేశాడు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్

సిద్దిపేట: సీఎం కేసీఆర్ అక్రమంగా డబ్బు దండుకోవడమే పనిగా పెట్టుకున్నాడని.. భారీ నీటిపారుదల శాఖా మంత్రిగా ఉన్న హరీష్ రావు అవినీతి సంపాదనలో తన వాటా కమీషన్ ఇవ్వడం లేదని ఆయన శాఖనే మార్చేశాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో పర్యటించిన ఆయన సిద్ధిపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. హరీష్ రావు శాఖను ఎందుకు మార్చారో కేసీఆర్ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇప్పుడు ఉన్న పదవి కూడా ఉంటాదో పోతాదో తెలియని పరిస్థితిలో హరీష్ రావు ఉన్నాడని, తనను మంత్రి పదవి నుండి తొలగిస్తే.. నాకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో పార్టీనే చీలుస్తానని కేసీఆర్ కు హరీష్ రావు వార్నింగ్ ఇచ్చాడని ఆయన పేర్కొన్నారు. ఈనెల 30 న జరగబోయే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తుంటే ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, టీర్ఎస్ పాలనపై విసుగుచెంది కనిపిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. బీజేపీకి ఇక్కడ ఒకే ఒక్క కౌన్సిలర్ ఉన్నా సిద్దిపేట పట్టణం అభివృధ్దికి పాటుపడ్డాం, అభివృద్ధి కోసం సిద్దిపేట మున్సిపాలిటీకి కేంద్రం ప్రభుత్వం అనేక నిధులు కేటాయించిందన్నారు. టీఆర్ఎస్ నాయకులకు డబ్బులు అవసరం ఉంటే రోడ్లు, డివైడర్లను కూల్చి మళ్లీ కొత్తగా కట్టి డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర ఆర్థిక సంఘం 30 కోట్ల 40 లక్షల రూపాయల నిధులిచ్చిందని, అలాగే 2799 ఇళ్లకు 137 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని బండి సంజయ్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తులు వచ్చాయి, ఎంత మందికి ఇళ్లు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. 6762 మంది వీధి వ్యాపారులకు 10 వేల రూపాయల చొప్పున  7కోట్ల నిధులు ఇచ్చామని, అమృత్ పథకం కింద 85 కోట్ల నిధులు, రాష్ట్ర ప్రభుత్వం కోటా కింద 26 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. మొత్తం 112  కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చిందని,  కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి సిద్దిపేట పట్టణాన్ని అభివృద్ధి చేశామని టీఆర్ఎస్ నాయకులు  గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. కోమటి చెరువు కోసం కోట్ల నిధులు ఖర్చు చేసి అభివృద్ధి చేశామని చెప్పి కోట్ల రూపాయలు దోచుకున్నారని,  దాని వల్ల ఒక్క ఎకరా కూడా నీరు రాలేదన్నారు. రాష్ట్రంలో టీర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఒక్క పరిశ్రమ లేదు ,ఒక్క ఉద్యోగం కూడా రాలేదని బండి సంజయ్ విమర్శించారు. హరీష్ రావుకు 50 రూపాయల పెట్రోల్ దొరికింది కానీ హరీష్ రావు కు 50 పైసల అగ్గిపెట్టె దొరకలేదని ఎద్దేవా చేశారు. తమ ఇంటిలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడు కేసీఆర్ మనుమడు కూడా కొత్త సెక్రటరీ వద్దకు వెళ్లి నా రూం ఎక్కడ అని వెళ్లి చూసుకుంటున్నాడని, ప్రగతి భవన్, ఫామ్ హౌస్ లో ఉండటానికా ? నిన్ను ముఖ్యమంత్రి ని చేసింది అని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ పార్టీ యాగాలు చేసి ఇతరుల నాశనం కోరుకోదని, ఫామ్ హౌస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ యాగాలు చేసి నాశనం కోరుకుంటున్నాడని ఆయన ఆరోపించారు. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుండి కోలుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నానని బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా లెక్కలు కూడా సరిగ్గా చూపడం లేదు, శవాలు కూడా దొరకకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయుష్మాన్ భవను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన నిలదీశారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవడానికి 5 ప్లాంట్ లను నిర్మాణం చేయాలని చెప్తే పట్టించుకోలేదని.. కోవిడ్ మీద ముఖ్యమంత్రి గాని.. ఒక్క మంత్రి కూడా నోరు మెదపడం లేదు ఎందుకు? అని ప్రశ్నించారు. 2500 కోట్ల రూపాయలు టీకా కోసం కేటాయించినా అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తే నువ్ నిధులు ఎందుకు ఇచ్చావ్, నీ 90 ఎం ఎల్ కోసమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోన వ్యాప్తి వల్ల ఆస్పత్రుల్లో పడకల కొరత తీవ్రంగా ఉంటే ముఖ్యమంత్రి కనీస నైతిక విలువలు లేకుండా పోయిందన్నారు. కోవిడ్ మీద దర్బార్ పెడితే టీర్ఎస్ నాయకులను ప్రజలు కుక్కలను కొట్టినట్టు కొడతారని హెచ్చరించారు. ఇక్కడ కౌన్సిలర్ లు అందరూ కాంట్రాక్టర్లేనని, హరీష్ రావు కు సంబంధించిన వ్యక్తే ఇక్కడ చైర్మన్, సిద్దిపేట పట్టణంలో ఓట్ల కోసం 5 వేల రూపాయలు, లేదా తులం బంగారం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్, ఇండిపెండెంట్ ఎవ్వరు గెలిచినా మళ్లీ టీఆర్ఎస్ లోకి వెళ్తారని, ఇవన్నీ తాము మాట్లాడితే మతం కోసం మాట్లాడుతున్నామని  అంటున్నారని చెప్పారు. భైంసాలో అల్లర్లు జరిగితే ఎందుకు నోరు మెదపడం లేదు? మతం కోసం మేము మాట్లాడటంలేదన్నారు. ఎంఐఎం పార్టీ లుచ్చా గాళ్ల  పార్టీతో సంబంధాలు పెట్టుకుంటారని, దారుసలాంలో సైరన్ మోగేతే ప్రగతి భవన్లో  వినిపిస్తుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.