రామగుండంలో లక్ష మందితో బీజేపీ సభ

రామగుండంలో లక్ష మందితో బీజేపీ సభ

హైదరాబాద్: ఈ నెల 12 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రామగుండంలో పర్యటించనున్న మోదీ.. ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. కాగా అదే రోజు లక్ష మందితో రామగుండంలో బీజేపీ సభను నిర్వహిస్తున్నామని, ఈ సభకు మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. మోడీ సభకు సంబంధించిన ఏర్పాట్లపై సంజయ్ పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు.

నవంబర్ 12న మోడీ రామగుండంకు వస్తారని చెప్పారు. అక్కడ ఎరువుల కర్మగారాన్ని ప్రారంభించి జాతికి అంకితమిస్తారని, అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. రూ.6120 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని పార్టీ నాయకులను కోరారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుందో వివరించాలని చెప్పారు. మోడీ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని బండి సంజయ్ కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.