గత మేనిఫెస్టోకే దిక్కులేదు..కొత్త హామీలా: కిషన్ రెడ్డి

గత మేనిఫెస్టోకే దిక్కులేదు..కొత్త హామీలా: కిషన్ రెడ్డి

 

  • బీఆర్ఎస్ పాత హామీల అమలుపై చర్చకు రావాలి 
  • కేసీఆర్ సకల జనుల ద్రోహి, నయవంచకుడు: బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్​రెడ్డి
  • కేసీఆర్ సర్కార్ ను యువతే కూల్చేస్తది: ఎంపీ కె. లక్ష్మణ్ 

హైదరాబాద్, వెలుగు: ‘‘గత మేనిఫెస్టోలోని హామీలనే అమలు చేయలేని సీఎం కేసీఆర్ ఇప్పుడు కొత్తగా ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలను మాత్రం ఎట్ల అమలు చేస్తడు”అని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఓట్ల కోసం ప్రజలను మభ్యపెడుతున్నారని.. ఆయన సకల జనుల ద్రోహి అని, నయవంచకుడని ఫైర్ అయ్యారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ ఎంపీ కె. లక్ష్మణ్ తో కలిసి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కేసీఆర్ అమలు చేయలేదన్నారు. ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తానంటే  నమ్మేందుకు ప్రజలు అమాయకులు కారన్నారు. గతంలో ఇచ్చిన హామీల అమలుపై కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ సీఎం పదవిని చేపట్టి రాష్ట్రంలో అప్పులు, అవినీతితోపాటు అహంకారం పెంచుకున్నారు తప్ప రాష్ట్ర సంపదను మాత్రం పెంచలేదన్నారు. 

‘‘దళితుడిని సీఎం ఎప్పుడు చేస్తవు? మూడు ఎకరాల భూమి ఎప్పుడిస్తవు? ఒక్కరికన్నా నిరుద్యోగ భృతి ఇచ్చినవా? నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్, మహిలా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, రైతులకు ఉచిత ఎరువులు.. ఇలా వందల హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచావు” అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. 

జిల్లాకో ‘నిమ్స్’ ఏదీ? 

24 జిల్లా కేంద్రాల్లో నిమ్స్ స్థాయి సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్స్ కడతామని ఒక్కటి కూడా కట్టలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. దళితులకు రూ. 50 వేల కోట్ల స్పెషల్ ఫండ్, సబ్ ప్లాన్ నిధుల వినియోగం, మహిళా బ్యాంకులు, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వంటి హామీలనూ అటకెక్కించారని విమర్శించారు. ‘‘హైదరాబాద్ నుంచి వరంగల్​కు ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడ పోయింది? గ్రామాలకు కేంద్రం ఇచ్చే నిధులు తప్ప రాష్ట్ర నిధులు మాత్రం ఇవ్వడంలేదు. మూసీ ప్రక్షాళన అన్నారు.. కార్పొరేషన్ పెట్టి వదిలేశారు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ను నిర్లక్ష్యం చేశారు. హైదరాబాద్ కు నార్త్ లో కొత్త ఎయిర్ పోర్టు హామీ ఏమైంది? వరంగల్ ఎయిర్ పోర్టుకు ల్యాండ్ ఎందుకు ఇస్తలేరు? ఇవన్నీ చేయకుండా కేవలం గ్రాఫిక్స్ చూపించి మభ్యపెట్టారు” అంటూ విమర్శించారు. 

కార్పొరేషన్లు పెట్టి విచ్చలవిడిగా అప్పులు 

మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి భ్రష్టు పట్టించిన వ్యక్తి కేసీఆర్ అని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎఫ్ఆర్​బీఎం నుంచి తప్పించుకోవడానికి మూసీకి, రోడ్లకు,​ హుస్సేన్ సాగర్​కు, వాటర్​కు, కాళేశ్వరానికి.. అనేక కార్పొరేషన్లు పెట్టి నాబార్డు, ఇతర బ్యాంకుల్లో అప్పులు చేశారని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్​మెంట్, ఆరోగ్యశ్రీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారన్నారు. ఇవన్నీ ప్రజలకు చెప్పకుండా తెలంగాణను ఉద్ధరిస్తామని మళ్లీ మేనిఫెస్టోలో చెబుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ సర్కారు చేతగానితనంతో పరీక్షలు సక్కగా జరగడంలేదని, నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. బీఆర్ఎస్ సర్కార్ వి బెస్ట్ పాలసీలు అని కేసీఆర్ చెబుతున్నారని, కానీ అవి వరస్ట్ పాలసీలని మండిపడ్డారు.

యువతే కూల్చేస్తది: లక్ష్మణ్

ప్రజలను నమ్మించి, వంచించడం కల్వకుంట్ల కుటుంబానికే చెల్లుతుందని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. అమలుకు నోచుకోని హామీలతో మరోసారి మోసం చేస్తారని ప్రజలను హెచ్చరించారు.  2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలుచేయలేదో చెప్పాలన్నారు. ‘‘గృహలక్ష్మి పథకం ఏమైంది? దళితబంధు ఎంతమందికి ఇచ్చారు? దివ్యాంగులకు ఏం చేశారు? మహిళా సంఘాల పైసలు దోచుకున్నరు. మహిళలకు ప్రధాని మోదీ రిజర్వేషన్లు తెచ్చారు. బీఆర్ఎస్ ఒక్క ఓబీసీ మహిళకూ టికెట్ ఇవ్వలేదు. బీసీ సబ్ ప్లాన్ చట్టం ఏమైంది?” అని కేసీఆర్ ను లక్ష్మణ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమన్నారు. దేశంలో రేషన్ కార్డు ఇవ్వలేని ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు.