- సామాన్యుడి ఇంటిపైకి బుల్డోజర్ వస్తే ఊరుకోం
- రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి హెచ్చరిక
- మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటన
హైదరాబాద్/సికింద్రాబాద్/అంబర్ పేట, వెలుగు: పేదోడి ఇంటిపైకి బుల్డోజర్ వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పేదల ఇండ్లు కూల్చివేశారని, పేదల సమాధులపై సుందరీకరణా చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలు తమ కష్టార్జితంతో ఒక్కో ఇటుక పేర్చుకుని కట్టుకున్న ఇండ్లను కూలుస్తారా? అని మండిపడ్డారు. మూసీ సుందరీకరణకు లక్షా యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందులో రూ. 50 వేల కోట్లతో ఇండ్లు లేని పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
బుధవారం అంబర్పేట్ లోని మూసారంబాగ్, అంబేద్కర్ నగర్, తులసి నగర్, కృష్ణానగర్ మూసీ పరీవాహక ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటించారు. తమ ఇండ్లు కూలగొడితే రోడ్డున పడతామంటూ ఆయా బస్తీల వాసులు మంత్రి ముందు గోడు వెళ్లబోసుకున్నారు. వారికి అండగా ఉంటామని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టి అక్కడ నివసిస్తున్న పేదలను రక్షించాల్సింది పోయి ఉన్న ఇండ్లను కూల్చడమేంటని ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి తప్పుపట్టారు. గతంలో అప్పటి సీఎం కేసీఆర్ కూడా మూసీ సుందరీకరణ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రేమ్ సింగ్ రాథోడ్ ను చైర్మన్ ను చేశారని.. అప్పుడు కూడా ఇదే తరహాలో ఇండ్లపై మార్కింగ్ చేశారన్నారు. పేదల ఇండ్లను టచ్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
థర్మల్ విద్యుత్ త్వరలో బంద్ కావొచ్చు..
వాతావరణ మార్పులను నివారించి, పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి త్వరలోనే బంద్ కావొచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. థర్మల్ పవర్ ద్వారా ఉత్పత్తి అవుతున్న వస్తువులను నిషేధించే పనిలో ప్రపంచ దేశాలు ఉన్నాయని, రానున్న రోజుల్లో మన దేశంలోనూ థర్మల్ పవర్ చాలెంజ్ గా మారుతుందన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పర్యావరణ పరిరక్షణ గొప్పతనాన్ని చాటుతూ15 ఏండ్ల స్ఫూర్తి థియావేదుల రూపొందించిన ‘టుమారో విల్ నాట్ టేక్ కేర్ ఇట్ సెల్ఫ్’ అనేషార్ట్ ఫిల్మ్‌ను సినీ డైరెక్టర్ కోన వెంకట్ తో కలిసి కిషన్ రెడ్డి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్ఫూర్తిని అభినందించారు. యూకేతో పాటు కొన్ని దేశాల్లో రానున్న రోజుల్లో కోల్ ఆధారిత పవర్ ప్రొడక్షన్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
చదువుకున్నోళ్లూ రోడ్లపై చెత్త వేస్తున్నరు..
స్వచ్చ భారత్ అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదని, అదొక ప్రజా ఉద్యమమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిఅన్నారు. కొంతమంది చదువుకున్నోళ్లు కూడా తమ ఇంట్లోని చెత్తను తెచ్చి రోడ్లపై పారేస్తున్నారని, అలాంటోళ్ల ఆలోచనలో మార్పు రావాలన్నారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహానికి కిషన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ సుచిత్ర, స్థానికులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు.