
సీఏఏ, ఎన్పీఆర్ పై ఏ చర్చకైనా సిద్ధం
హైదరాబాద్, వెలుగు: కేంద్రం దేశ ప్రయోజనాల కోసం చట్టాలు చేస్తే.. రాష్ట్రంలో టీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మతం రంగు పులుముతూ దేశ ద్రోహానికి పాల్పడుతున్నాయని బీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్ ఆరోపించారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్సీఆర్ లపై ఏ పార్టీతోనైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ ఒకేతాను ముక్కలని.. నిజామాబాద్ మజ్లిస్ సభకు టీఆర్ఎస్ ప్రతినిధులను పంపుతాననడం, కాంగ్రెస్, కమ్యూనిస్టులనూ పిలవాలని కేసీఆర్ సూచించడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు. సీఏఏ భారతీయ ముస్లింలకు వ్యతిరేకమని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని, లేకపోతే కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.
మీరు సమగ్ర కుటుంబ సర్వే చేయలేదా?
రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు ఏర్పడ్డ వెంటనే సమగ్ర కుటుంబ సర్వే చేయించిందని, అందులో పేర్లు నమోదు చేయించుకోని వాళ్లు తెలంగాణ వాళ్లే కాదన్నట్లు బిల్డప్ ఇచ్చిందని లక్ష్మణ్ గుర్తు చేశారు. అది రైటే అయితే దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ, సీఏఏ చట్టం తప్పెలా అవుతుందని నిలదీశారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు టైమివ్వని సీఎం.. మత రాజకీయాలు చేసే అసదుద్దీన్‌తో మూడు గంటలు మంతనాలు సాగించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్, మజ్లిస్కుట్రలకు టీఆర్ఎస్ మద్దతివ్వడం సిగ్గుచేటన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే మున్సిపల్ ఎన్నికలపై హడావుడి చేస్తున్నారన్నారు.
ఈ రోజు వర్క్ షాప్..
సీఏఏపై ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టేందుకు, వాస్తవాలు తెలిపేందుకు 30న హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో సభలు, ర్యాలీలు నిర్వహించనున్నట్టు లక్ష్మణ్ తెలిపారు. ఇక పార్టీ నేతలకు సీఏఏపై శనివారం (28న) పార్టీ రాష్ట్ర ఆఫీస్‌లో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు తెలిపారు.