
మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను బానిసత్వంలోనికి నెట్టివేసే లక్ష్యంతో 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చింది. పని ప్రదేశాలలో యూనియన్లు లేకుండా చేయటమే లక్ష్యంగా, కార్మిక వర్గాన్ని నిరాయుధుల్ని చేయడమే ధ్యేయంగా ఈ లేబర్ కోడ్స్ తీసుకొచ్చినట్టు స్పష్టమవుతున్నది.
2002లోనే ఆనాటి ప్రధాని వాజ్ పేయి ప్రభుత్వం రెండవ లేబర్ కమిషన్‌ను రవీంద్రవర్మ నేతృత్వంలో నియమించింది. ఆ కమిషన్ 44 కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోడ్స్ ను తీసుకురావాలని ప్రతిపాదించింది. అయితే, 2004లో అధికారంలోనికి వచ్చిన యూపీఏ ప్రభుత్వానికి వామపక్ష పార్టీల సహకారం ఉండటం, వారి ఒత్తిడితో లేబర్ కోడ్స్‌ను ముందుకు తీసుకురావడానికి వెనుకడుగు వేసింది. భారత లేబర్ కాన్ఫరెన్స్ లో కార్మికవర్గానికి సంబంధించిన బిల్లులు, పాలసీకి సంబంధించిన విషయాలపై కార్మిక సంఘాలతో ద్వైపాక్షిక చర్చలు జరుగుతుండేవి. అలాగే, కార్మిక సంఘాలను చర్చలకు పిలుస్తుండే విధానం కొనసాగింది.
2014లో అధికారంలోనికి వచ్చిన మోదీ ప్రభుత్వం కార్మిక సంఘాలతో సంప్రదింపులు చేసే విధానాన్ని పక్కకు పెట్టింది. తిరిగి రెండోసారి పూర్తిస్థాయి మెజార్టీతో 2019లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కార్మిక వర్గం, రైతాంగం అలాగే ప్రజల గొంతు నొక్కేవిధంగా ఉద్యమాలను కట్టడి చేసేందుకు, యజమానులకు మేలుచేసే ఉద్దేశంతో పాలిస్తున్నారు.
కార్మిక సంఘాలను బలహీనపరచడానికి.. పార్లమెంటులో తూతూ మంత్రంగా చర్చించి కార్మికులకు రక్షణగా ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ తీసుకురావడం జరిగింది. 2019 ఆగస్టులో వేతనాలపై కోడ్ బిల్లు 2020 సెప్టెంబర్ లో మూడు కార్మిక వ్యతిరేక బిల్లులను పార్లమెంటులో ప్రతిపక్షాలు బాయ్‌కాట్ చేసిన సందర్భంలో.. చర్చలు లేని పరిస్థితిలో హడావుడిగా ఆమోదించడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వ విధానాలను గమనిస్తే కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయడానికి పూనుకున్నదన్న విషయం అవగతం అవుతుంది. మూడు వ్యవసాయ నల్ల చట్టాలు 2020లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు సభ్యులు వాటికి నిరసనగా వాకౌట్ చేసిన సమయంలో ఈ బిల్లులు దొడ్డిదారిలో కేంద్రం ఆమోదింప చేసుకుంది.
కార్మికుల హక్కులపై మరణశాసనాలు
ఈ లేబర్ కోడ్స్‌ను సరిగ్గా పరిశీలిస్తే కార్మిక వర్గంపై ప్రత్యక్ష దాడి చేసేలా, వారి హక్కుల్ని హరింప చేసేందుకు ఉద్దేశించినవిగా ఇవి రూపొందించినట్టు తెలుస్తోంది. దేశ సహజ వనరులను ప్రజలను దోచుకోవడానికి కార్పొరేట్ యాజమాన్యాలకు లాభాలు కట్టపెట్టడానికి కార్మికులను మరింత శ్రమదోపిడీ చేసేలా ఉన్నాయి.
ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కార్మికుల సంఘాలు రైతుసంఘాలతో కలిసి నిరంతరం పోరాటాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా ఉద్యమాలు చేయడం వల్ల ఈ నాలుగేళ్ల నుంచి ఈ లేబర్ కోడ్స్ ను అమలు చేయడంలో కేంద్రం కాస్త వెనుకకు తగ్గింది. కానీ, 2024లో మూడోసారి అధికారంలోనికి వచ్చిన -మోదీ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్స్‌ను ఎలాగైనా అమలు చేయాలని లక్ష్యంగా ముందుకుసాగుతున్నది.
కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసేందుకే..
సుదీర్ఘకాలంగా కార్మికులు బ్రిటిష్ పాలనాకాలంలోనే అనేక పోరాటాలు చేసి 1926లోనే ట్రేడ్ యూనియన్ చట్టాన్ని,1923 లో వర్క్ మెన్ కాంపెన్సేషన్ చట్టం, 1935లో వేతనాలచట్టం, కనీస వేతన చట్టం, ఉద్యోగభద్రతలాంటి అనేక చట్టాలను సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న చట్టాలను కాలరాస్తూ సమష్టి బేరాల చర్యలను లేబర్ కోడ్స్ తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నది.
కార్మిక సంఘాల ఫిర్యాదులను వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని పేర్కొంటున్నది. ఫలితంగా నాన్ బెయిలబుల్ శిక్షలతో సహా పోలీసు చర్యలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. ఈ లేబర్ మీటింగులు, డిపార్ట్మెంట్ సమావేశాలు, కరపత్రాల పంపిణీ, మెమోరాండంలు అందజేయడం లాంటి ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలహక్కులను ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, సంస్థల్లో ఇప్పటికే నిషేధించింది.
ఫిక్స్డ్ టర్మ్ ఉపాధిని తీసుకురావడం ద్వారా ఉద్యోగ భద్రతతో పాటు అనేక సౌకర్యాలు అందజేయకుండా చూడటమే దీని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది. శాశ్వత ఉద్యోగి, ఉపాధి నుంచి ప్రస్తుతం అవుట్ సోర్సింగ్, అప్రెంటీస్, ఇంటర్న్‌షిప్ మొదలైన విధానాల ద్వారా కార్మికులను నియమిస్తున్నది. అంతేకాక ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ సౌకర్యాలను కూడా కార్మికులకు దూరం చేసే రూల్స్ ను ఈ లేబర్ కోడ్స్‌లో రూపొందించింది.
కార్మికుల హక్కుల్ని కాలరాసే మరణ శాసనాలుగా ఈ లేబర్ కోడ్స్ పని చేయనున్నవి. లేబర్ కోడ్స్ అమలును తీవ్రంగా తిప్పికొట్టడానికి ఇయ్యాల దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ పోరాటాలను మరింత సంఘటీతంగా ఐక్యంగా ముందుకు తీసుకుని వెళ్లాలని, కార్మిక వ్యతిరేక విధానాలు ఎండగట్టాలని దేశ ప్రజానీకానికి కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
లేబర్ కోడ్స్ కార్పొరేట్లకు చుట్టాలు
మోదీ ప్రభుత్వం జన విశ్వాసం అనే చట్టంలోని నిబంధనల ప్రకారం అనేక చట్టాల కింద కార్పొరేట్లకు సంబంధించి 180 నేరాలను నేర రహితం చేసింది. ఈ చట్టాలను ఉల్లంఘించినందుకు యజమానులకు జైలు శిక్షలు విధించే నిబంధనలను ఈ లేబర్ కోడ్స్ నుంచి ఉపసంహరించింది. 2025 కేంద్ర బడ్జెట్లో కూడా మరో 100 నేరాలను నేర రహితం చేసింది. ‘ శ్రమ సమాధాన్ ’, ‘శ్రమ సువిధ పోర్టల్ ’లు యజమానులు కార్మికచట్ట ఉల్లంఘనలను సులభతరం చేయడానికి, ఫిర్యాదు ఆధారిత తనిఖీలను ఈ లేబర్ కోడ్స్ ద్వారా రద్దు చేసింది.
- ఉజ్జిని రత్నాకర్ రావు,ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు-