షిప్ బిల్డింగ్లో అమెరికాకు చెక్ పెడుతున్న చైనా!

షిప్ బిల్డింగ్లో అమెరికాకు చెక్ పెడుతున్న చైనా!

గత  సామ్రాజ్యాల  విస్తరణలో  ఓడల నిర్మాణం,  సముద్ర  సరుకు రవాణా కీలకపాత్ర  పోషించింది. 15 నుంచి 17వ  శతాబ్దం వరకు  పోర్చుగీస్  సామ్రాజ్యం కొనసాగింది. అనంతరం 16 – 18 శతాబ్దంలో  స్పానిష్ సామ్రాజ్యం సాగింది.  డచ్ సామ్రాజ్యం 17 నుంచి 18వ శతాబ్దం వరకు  కొనసాగింది. ఈక్రమంలో  బ్రిటిష్  సామ్రాజ్యం 18 నుంచి 20వ శతాబ్దం వరకు కొనసాగింది.  స్పానిష్  సామ్రాజ్యాన్ని  బ్రిటన్  ఓడించింది.  

డచ్ సామ్రాజ్యం కూడా బ్రిటన్​తో జరిగిన యుద్ధంలో ఓడిపోయింది.   రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 8 దశాబ్దాలు అమెరికా ప్రపంచంపై బలమైన ఆధిపత్యాన్ని కలిగి ఉంది.  ప్రస్తుతం అమెరికా ఏక ధ్రువ ప్రపంచం బీటలువారి నేడు బహుళ  ధ్రువ ప్రపంచం ఉద్భవిస్తోంది.  గత 40 ఏళ్లలో భారీ ఓడల  నిర్మాణం,  సముద్ర సరుకు రవాణాలో  చైనా ఎదుగుదల..  పై పతన సామ్రాజ్యాల దోపిడీకి పూర్తి భిన్నంగా ఉంది.  సరుకు ఉత్పత్తి –పంపిణీ విధానాన్ని  చైనా చాలా చౌకగా,  విప్లవాత్మకంగా మార్చింది.   ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలో  ప్రపంచంలోనే  చైనా అగ్రభాగంలో నిలిచింది.  25 ఏళ్లుగా  చైనా ఆఫ్రికాలో అనేక రకాల ప్రాజెక్టులు, పోర్టులు నిర్మిస్తోంది.  

ప్రపంచ షిప్ బిల్డింగ్ నిర్మాణంలో 21వ శతాబ్దం  మేడ్ ఇన్ చైనా శతాబ్దంగా మారింది.   అమెరికా  ఒక్క  షిప్పును  నిర్మిస్తే  చైనా 333 షిప్పులను నిర్మాణం చేస్తోంది.  అమెరికా కంటే 300 రెట్లు అధికంగా చైనా భారీ ఓడల నిర్మాణం చేస్తోంది.  సరుకు రవాణాలో ఉపయోగించే భారీ కంటైనర్స్ లేదా ఆయిల్ ట్యాంకర్స్ లాంటివాటితోపాటు  ప్రపంచంలోని ఎక్కువ  భాగం కార్గో షిప్స్​ను  చైనా ఒక్క దేశమే నియంత్రిస్తోంది.  కేవలం రెండు దశాబ్దాల కాలంలో షిప్ బిల్డింగ్ నిర్మాణంలో ప్రాథమిక దశలో ఉన్న దాని పరిశ్రమ   ప్రపంచంలోనే  అగ్రస్థాయికి ఎదిగింది. 

 ప్రపంచవ్యాప్తంగా 57%  భారీ ఓడలను  చైనానే  నిర్మి స్తోంది.  సముద్రంలోకి వెళ్లే  ప్రతి భారీ రెండో షిప్  చైనా నిర్మించిందే.  ప్రపంచంలోనే అతి భారీ ఓడల నిర్మాణ  కేంద్రాలను  షాంగై,  డాలియన్, గాంగ్జులలో చైనా స్థాపించింది.  ప్రపంచ వ్యాపార ఓడల నిర్మాణ రంగంలో అమెరికా వాటా 0.01%కు పడిపోయింది. 

ప్రపంచంలోనే అతిపెద్ద  ఓడ ‘అంజి అన్షెంగ్’ 

చైనా  కార్లను  రవాణా చేసే  ‘అంజి అన్షెంగ్’ అనే ప్రపంచంలోనే అతిపెద్ద ఓడను నిర్మించింది. 7,000 కార్లతో ఇటీవల షాంగై ఓడరేవు నుంచి అది బయలుదేరింది.  228  మీటర్ల పొడవు, 37.8 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఓడ 9,500  కార్లను రవాణా చేయగలదు.  ఇది ఇంధన పొదుపును,  ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంది.  5.5 మిలియన్ వాహనాలను 2024లో అంతర్జాతీయ మార్కెట్​కు రవాణా అయ్యాయి. 2026 కల్లా ఇలాంటి భారీ ఓడల నిర్మాణం 22 నిర్మించాలని, ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.  

ప్రపంచంలోనే భారీ షిప్ లు నిర్మించడం ఓ పెద్ద సవాలు.  23 వేల కంటైనర్స్, 24 వేల కార్లను ప్రపంచంలో ఎక్కడికైనా రవాణా చేయగలగాలి. 400 మీటర్ల పొడవు. 61 మీటర్లు వెడల్పు. 78 మీటర్ల ఎత్తు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైనది. 3 లక్షల టన్నుల బరువును మోసుకెళ్తుంది. ఈ భారీ షిప్ బిల్డింగ్ యార్డ్ షాంగై నగరానికి బయట చాంగ్గింగ్  ఐలాండ్ లో నెలకొల్పారు. ఇక్కడ ప్రతి ఏటా కొన్ని డజన్ల షిప్పులు నిర్మిస్తారు.  ప్రపంచంలోనే  నిపుణులైన 6,000 మంది  ట్రేడ్స్ మెన్,  టెక్నీషియన్స్, ఇంజనీర్లు పనిచేస్తారు. 

ఎందుకు ఇంత భారీ షిప్స్? 

రవాణా ఖర్చులు తగ్గించి సరుకు రవాణాని చౌకగా మార్చడం.  సరుకులు మరింత చౌకగా అమ్మడం కీలక లక్ష్యం.  ఒకే షిప్పులో 23 వేల కంటైనర్స్ లేదా 24 వేల కార్ల రవాణా ప్రత్యేకత.  సముద్ర రవాణా అనేది రోడ్డు, ఎయిర్, రైలు రవాణా కంటే  చౌకైనది,  పర్యావరణహితమైనది.   భారీ ఓడల  నిర్మాణంలో 21వ  శతాబ్దంలో పర్యావరణహితం అనేది ఒక పెద్ద సవాలు.  అనేక బ్లాకులుగా నిర్మించి సర్జికల్ ప్రెసిసన్ తో ఒక భారీ షిప్ తయారుచేస్తారు.  దీని ఇంజన్ 20 మీటర్ల ఎత్తు అంటే ఆరంతస్తుల భవనంతో సమానం.  

ఈ ఇంజిన్ 24 మీ. పొడవు, 18 మీ. ఎత్తు, 2 వేల టన్నుల బరువు ఉంటుంది.  85,000 హార్స్ పవర్ శక్తిని సృష్టిస్తుంది.   ప్రపంచ  సరుకు రవాణా 80%  సముద్రాలలో జరుగుతుంది.  లక్ష  కార్గో షిప్ లు  సముద్రాల్లో నడుస్తున్నాయి.  అతి స్వల్పషిప్ నిర్మాణ  బలహీనతలు ఒక భారీ  విపత్తుకు  కారణం కావచ్చు. అందువల్ల క్షుణ్ణంగా పరిశీలిస్తారు. 12,661 స్టీల్ షీట్లు వినియోగిస్తారు.

 30, 40 ఏళ్ల తర్వాత షిప్​ డిస్మాంటిల్ అయినప్పుడు ఇవన్నీ మళ్లీ రీసైకిల్ చేస్తారు.  పర్యావరణహిత  నాచురల్  లిక్విఫైడ్ గ్యాస్ దీని ఇంధనం.  మైనస్ 161 డిగ్రీల అతి శీతల స్థితిలో ఉంటుంది. 27 సెం.మీ. మందంతో పాలీ యూరతిన్ చతుర్భుజాకారపు పలకల్లాంటివి ఇంధన ట్యాంకుకు రక్షణగా అతికించబడతాయి. ఇవి అతి శీతల స్థితి నుంచి రక్షిస్తాయి.  షిప్ నిర్మాణం పూర్తయిన తర్వాత 15 రోజులు టెస్ట్ డ్రైవ్​కి వెళ్తుంది. 

53 దేశాల్లో 95 పోర్టులు చైనావే

2010 నుంచి 2018 మధ్య  చైనా 132 బిలియన్ డాలర్ల విలువ చేసే షిప్పుల నిర్మాణం చేసింది. చైనా బెల్ట్ అండ్ (సిల్క్) రోడ్ ఇనీషియేటివ్ (BRI) లో  భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక పోర్టుల నిర్మాణం చేపట్టింది. వాణిజ్యాన్ని పెంచడంతోపాటు, భూ భౌగోళిక రాజకీయ పరిస్థితుల్ని సమూలంగా మార్చడం దీని ఉద్దేశం.  ప్రపంచవ్యాప్తంగా 96 నుంచి 100 ఓడరేవులలో  చైనా కీలక భాగస్వామ్యం ఉంది. సీఎస్​ఐఎస్​ అధ్యయనం ప్రకారం 2023 వరకు 53 దేశాలలో 95 పోర్టులను చైనా కలిగి ఉంది.  అమెరికా ఆధిపత్యంలోని  ప్రపంచ క్రమాన్ని మార్చడంలో చైనా శక్తిమంతంగా అడుగులు వేస్తోంది.  

2008తో పోలిస్తే ఓడల నిర్మాణంలో 50% ఉద్గారాలు తగ్గాయి.  పర్యావరణ ప్రమాణాలు పెరుగుతున్నాయి.  సముద్ర జీవ వైవిధ్యాన్ని రక్షించడం జరుగుతోంది.  చైనా దక్షిణ కొరియాల మధ్య  హైటెక్ ఓడల నిర్మాణంలో  పోటీ తీవ్రంగా ఉంది.  మరోవైపు 37 ట్రిలియన్ డాలర్ల అప్పులతో ఆర్థిక  పతనపు అంచులలో ఉన్న అమెరికా  ప్రపంచ ఆధిపత్యం వేగంగా కూలుతోంది.

చైనా ఈ స్థానానికి ఎలా ఎదిగింది? 

1999లో చైనా వాటా ఐదు శాతం. ఇది 2023 నాటికి 50% కు చేరింది.  2024 నాటికి ప్రపంచ షిప్ బిల్డింగ్​లో  57.1% చేరింది.  2020 –22 మధ్య  చైనా 4 వేల భారీ ఓడలను నిర్మాణం చేసింది.  అమెరికా కేవలం 12 ఓడలను  నిర్మించింది.  రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా ఓడల నిర్మాణంలో ప్రపంచ నాయకుడిగా ఉండేది.  ఆ స్థానాన్ని అమెరికా నేడు కోల్పోయింది. 

 చైనా 9,000 కంటే ఎక్కువ నౌకలను కలిగి ఉంది.  ఇది ప్రపంచంలోని మొత్తం నౌకలలో 34% వాటా.  అమెరికా 200 షిప్పులు కలిగి ఉంది. ఇవన్నీ కేవలం అమెరికా దేశ జలాల్లో తిరిగేవి.  ప్రపంచ సముద్ర  జలాల్లో అమెరికా ఓడలు మాయమైపోయాయి. నిర్దిష్ట ప్రమాణంతో  కూడిన కంటైనర్ షిప్ 1200 అడుగుల పొడవు ఉంటుంది. పదివేల (20 అడుగులకు సమానమైన సామర్థ్యం గల కార్గో బాక్స్)  టీఈయూ  సామర్థ్యంగల షిప్పును  చైనా 55 మిలియన్ డాలర్లకు నిర్మిస్తుంది. దాన్ని అమెరికా 330 మిలియన్ డాలర్లకు నిర్మిస్తుంది. అమెరికా నిర్మిస్తే ఆరు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది.  

- నైనాల గోవర్ధన్ ,సోషల్​ యాక్టవిస్ట్​-