కేంద్రం తగ్గించినా.. రాష్ట్రం ఎందుకు తగ్గిస్తలే? : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

కేంద్రం తగ్గించినా.. రాష్ట్రం ఎందుకు తగ్గిస్తలే? :  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
  •     డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం కట్, పెట్రోల్‌పై రూ.10 కోత
  •     సామాన్య ప్రజల కోసం మోదీ సాహసోపేత నిర్ణయం
  •     బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ.. దేశంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలే పరమావధిగా మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. 

డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా సున్నా స్థాయికి తగ్గించడం, పెట్రోల్‌పై కూడా రూ.10 మేర భారాన్ని తగ్గించి కేంద్రం తన బాధ్యతను చాటుకుందన్నారు. ఈ మేరకు రాంచందర్​రావు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. కేంద్రం పన్నులు తగ్గిస్తుంటే.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 35 శాతం వ్యాట్ ఉండడంతో సామాన్యుడిపై పెను భారం పడుతోందన్నారు. 

గత ప్రభుత్వాల అప్పులు, ఆయిల్ బాండ్ల భారం ఉన్నా కేంద్రం వెనక్కి తగ్గడంలేదని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పన్నుల రూపంలో ప్రజల రక్తాన్ని పిండుతోందని విమర్శించారు. పెట్రోల్ ధరలో కేంద్రం వాటా కంటే రాష్ట్రం వాటాయే ఎక్కువ ఉండటం దురదృష్టకరమన్నారు. సీఎం ఇప్పటికైనా మాటల గారడీలు పక్కనపెట్టి, వెంటనే వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం తన వాటా తగ్గిస్తేనే పెట్రోల్ ధర రూ.వందలోపు వస్తుందని, సామాన్యుడికి నిజమైన ఊరట లభిస్తుందన్నారు.