
- బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు డిమాండ్
మెదక్ / హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ తన పదవికి రాజీనామా చేసి బీసీని సీఎం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. శుక్రవారం మెదక్ లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ కు కేంద్రం సపోర్ట్ చేయడంలేదని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇస్తామంటున్న 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు కల్పించాలనుకుంటోందని, అలాచేస్తే నిజమైన బీసీలు నష్టపోతారన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదని విమర్శించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు తమ వద్ద ప్లాన్ ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కు బీసీ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే సీఎంను ఒప్పించి రాష్ట్ర కేబినెట్లో ఎనిమిది మంత్రి పదవులు బీసీలకు ఇప్పించాలని మహేశ్ గౌడ్‌కు సవాల్ విసిరారు.
పార్టీ లైనుకు విరుద్ధంగా మాట్లాడొద్దు
వివాదాస్పద అంశాలపై బీజేపీ నేతలు మీడియా వేదికగా పార్టీ లైన్ కు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయవద్దని రాంచందర్ రావు ఒక ప్రకటనలో హెచ్చరించారు. వివాదాస్పద అంశాలపై పార్టీ నాయకత్వం అనుమతి లేకుండా పత్రికలు, మీడియా ముందుకు వెళ్లొద్దని సూచించారు. కేవలం పార్టీ సూచించిన వ్యక్తులే మీడియా వేదికగా మాట్లాడాలన్నారు. ఇటీవల బీజేపీ నేత మాధవిలత పలు మీడియా సంస్థలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేయడం గమనార్హం.