కాంగ్రెస్కు ఓటమి భయం..అందుకే స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తున్నది: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

కాంగ్రెస్కు ఓటమి భయం..అందుకే స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తున్నది: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
  • మోదీపై నిందలువేసేందుకే యూరియా కృత్రిమ కొరత
  • పార్టీ మీడియా, ఐటీ అండ్ సోషల్ మీడియా వర్క్​షాప్​కు హాజరు

హైదరాబాద్, వెలుగు: ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తున్నదని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అన్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం ముగిసినా, 19 నెలలుగా ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వంపై నిందలు వేయడానికే కృత్రిమంగా యూరియా కొరత సృష్టించారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఆదివారం బీజేపీ మీడియా, ఐటీ అండ్ సోషల్ మీడియా స్టేట్ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. 

రాంచందర్ రావు హాజరై మాట్లాడారు. ‘‘మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నది. రైతులకు మెరుగైన ఆదాయం వచ్చేలా కృషి చేస్తున్నది. 11 ఏండ్లలో గ్రామీణాభివృద్ధికి విశేషంగా కృషి చేసింది. ఈ విజయాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉంది. కేంద్రం నుంచి 8% పన్ను వాటా వస్తున్నప్పటికీ, ఆ నిధులను అభివృద్ధి కోసం కాకుండా అవినీతి కార్యక్రమాలకు మళ్లిస్తున్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పాలనలో బిల్లులు రాక చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

దీనికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. రైతులకు రైతు భరోసా పథకం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి, కేవలం రూ.6 వేలు మాత్రమే ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసింది’’అని రాంచందర్ రావు ఆరోపించారు. సోషల్ మీడియా రెండు వైపులా పదునైన కత్తి లాంటిదని, దాన్ని కరెక్ట్​గా ఉపయోగించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీపై తప్పుడు ప్రచారాలు, విభేదాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీలు కే.లక్ష్మణ్, ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.