బెదిరింపులు, ప్రలోభాలే కేసీఆర్ ఫార్ములా

బెదిరింపులు, ప్రలోభాలే కేసీఆర్ ఫార్ములా

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి విముక్తి కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్ చుగ్ అన్నారు. టీఆర్‌ఎస్‌కు జనం గుడ్‌ బై చెబుతున్నారని, ఇక రాష్ట్రంలో బీజేపీని ఆపేవారు ఎవరూ లేరని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ చెవిటి, మూగ ప్రభుత్వం.. ప్రజలను దోచుకుంటున్నదని ఫైర్ అయ్యారు. భయపెట్టడం, బెదిరించడం, ప్రలోభపెట్టడమే కేసీఆర్‌ ఫార్ములా అని ఆరోపించారు. శనివారం ఢిల్లీలో తరుణ్ చుగ్‌తో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్, విజయ్ భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన సమావేశంలో తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి నేతల్ని అడిగి తెలుసుకున్నారు. పార్టీలోకి శ్రవణ్, విజయ్‌ చేరికపై చుగ్, సంజయ్ చర్చించారు. తర్వాత శ్రవణ్, విజయ్‌లను చుగ్ సన్మానించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోతున్నదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో పనిచేసే పరిస్థితుల్లో లేదని, టీఆర్‌ఎస్‌కు బీ టీంగా మారిందని విమర్శించారు.

బీజేపీలో చేరేటోళ్ల లిస్ట్ చాలా పెద్దదే

రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో బీజేపీ తమ ఉనికిని చాటుకుంటున్నదని, ప్రజలు బహిరంగంగానే బీజేపీకి మద్దతు ఇస్తున్నారని తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్ చేసిన ఇంటెలిజెన్స్‌ సర్వేలు కూడా టీఆర్‌ఎస్‌ వెనకబడిపోయిందని రిపోర్టులు ఇచ్చాయన్నారు. రాష్ట్రంలో కాషాయ కండువా కప్పుకునే వారికి సంబంధించి చాలా పెద్ద లిస్ట్‌ సిద్ధంగా ఉందని వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి, శ్రవణ్, విజయ్‌ల చేరిక ఒక ట్రైలర్‌ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని చెప్పారు. ఏవైనా ఇచ్చిపుచ్చుకొనే సంస్కృతి కాంగ్రెస్‌ పార్టీది తప్ప, తమది కాదన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో చేపట్టిన పల్లే గోస– బీజేపీ భరోసా యాత్ర, బైక్‌ ర్యాలీలు, ప్రజా సంగ్రామ యాత్రలను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. ఈ యాత్రలతో రోజురోజుకు బీజేపీకి మద్దతు పెరుగుతున్నదని అన్నారు.

చెల్లని రూపాయిలా కేసీఆర్ కుటుంబం: సంజయ్

కాంట్రాక్టులు, డబ్బులు ఇచ్చి పార్టీలో చేర్చుకొనే సంస్కృతి బీజేపీలో లేదని, అది కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ కల్చర్ అని బండి సంజయ్ విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచే కాంట్రాక్టర్ అని గుర్తు చేశారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలనే బండ బూతులు తిట్టిన వాళ్లు ప్రస్తుతం ఆ పార్టీ లీడర్లు అయ్యారని పరోక్షంగా రేవంత్‌ను విమర్శించారు. తెలంగాణ పోరాటంలో భాగస్వామ్యులైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌ లాంటి నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో ఎందుకు ఇమడలేకపోతున్నారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే కానీ భాష హద్దు మీరితే ప్రజలు క్షమించరన్నారు. కేసీఆర్‌ కుటుంబ పరిస్థితి చెల్లని రూపాయిలా మారిపోయిందన్నారు.