ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ డ్రామా

ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ డ్రామా
  • జాతీయ పార్టీ వార్తలపై తరుణ్ చుగ్ 

న్యూఢిల్లీ, వెలుగు: టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని బీజేపీ స్టేట్ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ సాధించిందేమీ లేదని, చెప్పుకోవడానికి చేసిందేమీ లేకపోవడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు జాతీయ పార్టీ పేరుతో ఆయన డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. భారత్ రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) పేరుతో కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారన్న వార్తలపై తరుణ్ చుగ్ శనివారం ఢిల్లీలో స్పందించారు. ‘‘కేసీఆర్.. ఢిల్లీలో రాజకీయం చేయాలంటే చేసుకో. కొత్త పార్టీ పెట్టాలంటే పెట్టుకో. అన్ని పార్టీల లాగే మీ పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకోండి. అయితే బంగారు తెలంగాణ స్వప్నం ఎప్పుడు సాకారమవుతుందో ముందు ప్రజలకు చెప్పండి’’ అని తరుణ్ చుగ్ అన్నారు. టీఆర్ఎస్ ఎనిమిదేండ్ల పాలనపై ప్రజలకు రిపోర్టు కార్డు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని సెవెన్ స్టార్ ఫామ్ హౌస్​లో కూర్చోని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు.  

ముందు రాష్ట్రంపై దృష్టి పెట్టండి.. 

జాతీయ రాజకీయాలు అంటూ హడావిడి చేస్తున్న సీఎం కేసీఆర్.. ముందు రాష్ట్రంపై దృష్టి పెట్టాలని తరుణ్ చుగ్ సూచించారు. బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలన్నారు. ప్రభుత్వ వాహనాల్లోనే అత్యాచారాలు జరుగుతున్నాయని, ఆ బండ్లలోనే నిందితులు తిరుగుతున్నారని ఆరోపించారు. ‘‘నిందితులను కాపాడేందుకు సీఎం ప్రయత్నం చేస్తున్నారు. అందుకే జూబ్లీహిల్స్ రేప్ ఘటనపై స్పందించడం లేదు” అని ఆరోపించారు. ‘‘కేసులో నిందితుణ్ని అరెస్టు చేయరు. రేప్ జరిగిన వెహికల్ ను దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఘటన జరిగి 15 రోజులైనా ఆ వాహనం తిరుగుతూనే ఉంటుంది. ఇంత ఘోరంగా కేసీఆర్ పాలన సాగుతోంది” అని విమర్శించారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు.. భక్షకులుగా మారారని మండిపడ్డారు.