ప్రజా సమస్యలపై బీజేపీ పోరు

ప్రజా సమస్యలపై బీజేపీ పోరు
  • 20 నుంచి వివిధ అంశాలపై ఆందోళనలు 
  • మొదట డబుల్బెడ్ రూమ్ ఇండ్లపై... 
  • ఆ తర్వాత రేషన్ కార్డులు, ధరణిపై  ధర్నాలు 

హైదరాబాద్, వెలుగు : ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి వివిధ అంశాలపై ఆందోళనలు చేపట్టనుంది. మొదట డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై.. ఆ తర్వాత రేషన్ కార్డులు, ధరణి తదితర సమస్యలపై ధర్నాలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల పక్షాన పోరాడేది బీజేపీనేననే నమ్మకం జనాల్లో కల్పించాలని, బీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నించాలని ఇటీవల జరిగిన కోర్ కమిటీ, ఆఫీస్ బేరర్ల మీటింగ్​లో పార్టీ పెద్దలు రాష్ట్ర నేతలకు సూచించారు. 

దీనికి అనుగుణంగా రాష్ట్ర బీజేపీ ఇప్పటికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. అందులో భాగంగానే ప్రజా సమస్యలపై పోరుబాట పట్టాలని, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు జనంలోనే ఉండాలని నిర్ణయించింది. మొదట ఈ నెల 20న ఇబ్రహీంపట్నం మండలం బాట సింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బీజేపీ నేతలు పరిశీలిస్తారు. 24న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇదే అంశంపై ధర్నాలు నిర్వహిస్తారు. 25న హైదరాబాద్ లోని ధర్నాచౌక్ లో మహా ధర్నా చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. కాగా, ఓవైపు ప్రజా సమస్యలపై పోరాడుతూనే.. మరోవైపు పార్టీ ప్రోగ్రామ్స్ ను వేగవంతం చేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 16న ‘టిఫిన్ బైఠక్’ ప్రోగ్రామ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఆ రోజు 119 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశమవుతారు. ఎవరింట్లో నుంచి వాళ్లు టిఫిన్ బాక్స్ తెచ్చుకుని, అందరూ ఒకచోట కలిసి తింటారు. 

22న కోర్ కమిటీ మీటింగ్

ఈ నెల 22న పార్టీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ జరగనుంది. దీనికి పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జ్ ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్ చార్జ్ సునీల్ బన్సల్, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ తరుణ్ చుగ్, సంస్థాగత సహ ఇన్ చార్జ్ అరవింద్ మీనన్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఈ నెల 29న ఖమ్మంలో జరగనున్న అమిత్ షా సభపై, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై చర్చించనున్నారు.

21న అధ్యక్షుడిగా  కిషన్ రెడ్డి బాధ్యతలు 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 21న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకు ముందు పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని ఆయన దర్శిం చుకుంటారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కిషన్ రెడ్డి.. ఈ నెల 19న ఢిల్లీకి చేరుకోనున్నారు.