ప్రభుత్వ టీచర్లపై కేసీఆర్ కక్షగట్టారు

ప్రభుత్వ టీచర్లపై కేసీఆర్ కక్షగట్టారు

ప్రభుత్వ టీచర్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ కక్ష కట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టీచర్లు ఏటా ఆస్తులు సమర్పించాలనే ఆదేశాలు కక్ష సాధింపులో భాగమేనని చెప్పారు. సీఎం కేసీఆర్ మాత్రం తన ఆస్తులను ఏటా ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. కేబినెట్ లో ఉన్న మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఆస్తుల వివరాలను ప్రతి సంవత్సరం వెల్లడించే ధైర్యముందా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ టీచర్లు తమ ఆస్తుల వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడాన్ని తప్పుపట్టారు. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులు తమ ఆస్తుల వివరాలను సబ్మిట్ చేయాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. స్థిర, చర ఆస్తులు అమ్మినా, కొన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. విద్యాశాఖలో పని చేస్తున్న ఉద్యోగులందరూ వార్షిక ప్రాపర్టీ స్టేట్ మెంట్ సమర్పించాలని పేర్కొనడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. 

తుగ్లక్ మాదిరిగా కేసీఆర్  నిర్ణయాలు

ఈ నిర్ణయం ముమ్మాటికీ ఉపాధ్యాయులను  వేధించడంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలుగా భావిస్తున్నామని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను వేధించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తుగ్లక్ మాదిరిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. 317 జీవో పేరుతో ఉపాధ్యాయులను వేధిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా బదిలీలు చేస్తూ టీచర్లకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు సక్రమంగా చెల్లించకుండా, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను కూడా పరిష్కరించని సీఎం కేసీఆర్ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం హాస్యాస్పదమన్నారు. 

నిలదీస్తే తట్టుకోలేకపోతున్నారు

టీఆర్ఎస్ నియంత, కుటుంబ, అవినీతి పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలను టీచర్లు ప్రశ్నిస్తుంటే సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని  బండి సంజయ్ ఆరోపించారు. 317 జీవోను వ్యతిరేకిస్తూ సర్కార్ ను నిలదీస్తే తట్టుకోలేకపోతున్నారని అన్నారు. కేసీఆర్ పాలనతో తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు చెబుతూ వారిని చైతన్యం చేస్తున్నారనే భయం పట్టుకుందన్నారు. టీచర్లతో సహా విద్యాశాఖలో పని చేస్తున్న ఉద్యోగులందరినీ వేధించి, కక్ష తీర్చుకోవడానికే ఈ జీవోను తీసుకొచ్చారని ఆరోపించారు. ఇన్నేళ్ళుగా లేనిది కేసీఆర్ కు ఇప్పుడే ఈ జీవో ఎందుకు గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాకముందుకు ఆస్తులు ఎన్ని..? సీఎం అయిన తర్వాత ఆస్తులెన్ని..? వాటి వివరాలను ఎందుకు ఏటా విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఇకపై సీఎంతో సహా ఆయన కుటుంబ సభ్యులందరూ ప్రతి సంవత్సరం ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తమ ఆస్తుల వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.