
ఖమ్మం: బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్యకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సాయి గణేశ్ మృతికి కారణమైన వాళ్లని వదిలే ప్రసక్తిలేదని వార్నింగ్ ఇచ్చారు. శనివారం ప్రజా సంగ్రామ యాత్రకు రెండో దశ ముగింపు సభలో పాల్గొన్న ఆయన... ఆదివారం ఖమ్మం జిల్లాలోని సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన చావుకు మంత్రి పువ్వాడ అజయ్ కారణం అంటూ సాయి గణేశ్ మరణ వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు. అయినా ఇంత వరకు మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. స్థానిక పోలీసులు మంత్రి పువ్వాడ అజయ్ కి అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆరోపించారు.
విద్యను వ్యాపారంగా మార్చిన పువ్వాడ అజయ్ కి... వ్యాపారమే ధ్యేయంగా అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. నోరు తెరిస్తే తన కులం గురించి మాట్లాడుతూ... మంత్రి అజయ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కబ్జా దారులు, దోపిడీ దారులు రాష్ట్రాన్ని ఏలుతున్నారన్న సంజయ్... ఈ దందాల నుంచి వచ్చే ప్రతి రూపాయిలో ప్రగతి భవన్ కు వాటా ఉందని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తే ఊరుకునేదిలేదని... చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు.
మరిన్ని వార్తల కోసం...