
హైదరాబాద్ : ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలు లెక్చరర్లు, టీచర్లకు వెంటనే వేతనాలు చెల్లించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కార్పొరేట్ స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు టీచర్లు, లెక్చరర్లకు వెంటనే జీతాలు చెల్లించాలన్నారు. చైతన్యపురి లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ లెక్చరర్ డా.హరినాథ్ జీతాలు లేక ఆత్మహత్యాయత్నం చేయడం కలిచి వేసిందన్నారు. ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన అధ్యాపకులను జీతాలివ్వకుండా వేధించి, వాళ్ళ ఉసురు పోసుకోవద్దని సూచించారు బండి సంజయ్.
ఈ సిబ్బంది ఇన్నాళ్లు శ్రమించడం వల్లనే కార్పొరేట్ సంస్థలు కోట్లు సంపాదించుకుని ఇప్పుడు వారిని రోడ్డున పడేయడం అమానవీయం అన్నారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ, అధ్యపకులను మాత్రం వేతనాలు ఇవ్వకుండా వేధిస్తారా ? అని ప్రశ్నించారు. టీచర్లు, లెక్చరర్లకు జీతాలు ఇవ్వక పోతే ఆయా సంస్థల సిబ్బందే కార్పొరేట్ కాలేజీలను ముట్టడించే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు బండి సంజయ్.