హిందూ దేవుళ్లను కించపరిస్తే బడితె పూజే : బండి సంజయ్

హిందూ దేవుళ్లను కించపరిస్తే బడితె పూజే : బండి సంజయ్

హిందూ దేవుళ్లను కించపరిస్తే బడితె పూజే

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు : హిందూ ధర్మాన్ని కించపరిచే హబ్ గా తెలంగాణ మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. హిందూ దేవుళ్లను కించపరిచే వాళ్లకు బడితె పూజ చేయాలన్నారు. శనివారం కూకట్​పల్లి అయ్యప్ప దేవాలయంలో జరిగిన పడి పూజలో సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కొందరు అయ్యప్పను కించపరిచే విధంగా మాట్లాడుతున్నరు. హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్లను కించపరిస్తే ఊరుకునేది లేదు. అలాంటి వాళ్లపై పోరాడే వాళ్లకు బీజేపీ, హిందూ వాహిని వంటి  ధర్మ సంఘాలు అండగా ఉంటాయి. ధర్మం కోసం రాజకీయాలు అవసరం లేదు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా.. హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోవద్దు. మన కల్చర్ మనమే కాపాడుకోవాలి. సంఘటితంగా ఉంటేనే హిందూ ధర్మాన్ని కాపాడుకోగలం” అని చెప్పారు.

‘‘రాష్ట్రంలో హిందువులపైన పీడీ యాక్ట్ లు పెడ్తరు. కానీ,  హిందూ దేవుళ్లను కించపరిచిన వారిపైన చర్యలు తీసుకుంటలేరు. సీఎం కేసీఆర్ ఏమో.. తానే నిజమైన హిందువు అంటడు. ఆయన కొడుకేమో నాస్తికుడు.. దేవుళ్లు అంటే ఆయనకు నమ్మకం ఉండదు. బైరి నరేశ్​ అనే వ్యక్తి హిందువులను అవమానపరిచే విధంగా మాట్లాడితే.. అగ్గిపెట్టె మంత్రి హరీశ్​రావు సమర్థిస్తున్నడు. సిగ్గులేకుండా మాట్లాడుతున్నడు. మేము రోజుకో దేవుడికి మొక్కుతాం...మేము మొక్కితే కొంత మందికి నొప్పి అవుతుంది” అని బండి సంజయ్​ అన్నారు. హిందూ దేవుళ్లను కించపరిచే అధికారం బైరి నరేశ్​కు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పార్టీలు కాదు.. ధర్మం కోసం పోరాడేవాళ్లే మన నాయకులు” అని ఆయన అన్నారు.