- వారిని సీఎం కేసీఆర్ రెచ్చగొడుతున్నారు
- ఆర్టీసీ ఆస్తులపై కన్నేశావ్.. అందుకే ఉద్యమానికి మా మద్దతు
- సమ్మెకు, ఉప ఎన్నిక ఫలితానికి లింక్ ఏమిటి?
- హుజూర్ నగర్ గెలుపు ఓ గెలుపేనా?
- అధికార దుర్వినియోగం, డబ్బుతో గెలిచారు
- లక్ష్మణ్‌ను కలిసిన ఆర్టీసీ జేఏసీ నాయకులు
హైదరాబాద్, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్లపై ఆర్టీసీ కార్మికులు 21 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్నప్పటికీ, సీఎం కేసీఆర్ వారిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తప్పుపట్టారు. రాజకీయాలుంటే చూసుకుందామని, పిచ్చుక మీద బ్రహ్మాస్ర్తంలా ఆర్టీసీ కార్మికులపై కక్ష గట్టి, సమ్మె చేస్తున్న వారిపై ప్రతాపం చూపడమేమిటని మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను వేసినందుకే, బీజేపీ ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి మద్దతిచ్చిందని ఆయన స్పష్టం చేశారు. సీఎం వ్యాఖ్యలతో ఆర్టీసీ కార్మికులెవరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని లక్ష్మణ్ కోరారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆశ్వత్థామరెడ్డి నాయకత్వంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు లక్ష్మణ్ ను కలిశారు. ఆర్టీసీపై సీఎం వ్యాఖ్యలు, రాబోయే రోజుల్లో జేఏసీ చేపట్టబోయే ఆందోళనలపై యూనియన్ నేతలు లక్ష్మణ్ తో చర్చించారు. ఆ తర్వాత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న ప్రతి ఆందోళనకూ బీజేపీ అండగా నిలుస్తుందని, భవిష్యత్తులోనూ పూర్తి మద్దతుగా నిలుస్తుందన్నారు.
సమ్మెకు, ఉప ఎన్నిక ఫలితానికి లింక్ ఏమిటి
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత కేసీఆర్ ఆర్టీసీ గురించి వ్యాఖ్యలు చేయడం ఆయన అహంభావాన్ని తెలియజేస్తుందని లక్ష్మణ్ అన్నారు. ఆర్టీసీ సమ్మెకు, హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ఉప ఎన్నిక ఫలితాలను అధికారంలో ఉన్న ఎన్నో ప్రభుత్వాలు చూశాయని, హుజూర్ నగర్ గెలుపు ఓ గెలుపేనా అని ఎద్దేవా చేశారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి, కోట్లు ఖర్చు చేసి, కులానికి, మతానికి ఓ నాయకుడిని పెట్టి జనాన్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. గతంలో నంద్యాల అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఏపీలోని అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందని, సాధారణ ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ పరిస్థితి, చంద్రబాబు రాజకీయ జీవితం ఏమైందో గుర్తుంచుకోవాలని కేసీఆర్ కు సూచించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ కూ అదే గతి పట్టనుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూతురు కవిత ఓడిపోయినా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయినా కేసీఆర్ బయటకు రాలేదని, హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారని లక్ష్మణ్ మండిపడ్డారు.
కేసీఆర్‌ను చూసి ఊసరవెల్లీ సిగ్గుపడుద్ది
మెదక్, వెలుగు: ఉద్యమ సమయంలో ఓ మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్న కేసీఆర్నుచూసి ఊసరవెల్లి సిగ్గు పడుతోందని లక్ష్మణ్ అన్నారు. గాంధీ సంకల్ప యాత్ర శుక్రవారం మెదక్ చేరింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఉద్యమం అప్పుడు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడగొడతామంటున్నారని మండిపడ్డారు. సెక్రటేరియట్‌కు రాని సీఎం.. నెలకు రూ.4.5 లక్షలు తీసుకుంటున్నారని, హక్కులు రక్షించమని కోరినందుకు కార్మికుల జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, ఎవడబ్బ సొమ్మని వరంగల్, కరీంనగర్, ఆర్మూర్‌లో ఆర్టీసీ స్థలాలను మంత్రులు, ఎమ్మెల్యేలకు లీజు కిచ్చారని ప్రశ్నించారు. ఆర్టీసీ చరిత్ర ముగిసిపోయిందంటున్న కేసీఆర్ చరిత్ర త్వరలోనే ముగుస్తుందన్నారు. తాము గాంధీ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ లీడర్లు నకిలీ గాంధీలని విమర్శించారు.

