నేనెవరికీ బినామీ కాదు: కిషన్ రెడ్డి

నేనెవరికీ బినామీ కాదు: కిషన్ రెడ్డి
  • కేసీఆర్ ను కలువలేదు
  • కాళేశ్వరంపై విచారణ చేస్తేకమీషన్లెవరు తీసుకొన్నరో బయపడ్తది
  • ప్రధానిని గజదొంగ అంటరా
  • బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ స్టేట్ చీఫ్​, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాలు విసిరారు. కాళేశ్వరం  ప్రాజెక్టుపై తాను మాట్లాడితే ఆదాయం తగ్గినట్టు ఉంది అని సీఎం కామెంట్ చేయడాన్ని కిషన్ రెడ్డి తప్పుపట్టారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే విచారణ చేయించాలని, కమీషన్లు ఎవరు తీసుకున్నారో తెలుస్తుందంటూ కామెంట్ చేశారు.  

ఇవాళ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన స్థాయిని తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ప్రధాని మోదీని గజదొంగ అంటూ కామెంట్ చేయడంపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ జాతీయ నేతలే గజదొంగలన్నారు. ఆ గజదొంగలకు యముడు మోదీ అని అన్నారు.  ఆయన అవినీతి పరులెవ్వరినీ వదలరన్నారు. రేవంత్ రెడ్డి ఎలా సంపాదించారు..? ఆయనపై ఎన్ని కేసులేంటి అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసునని కిషన్ రెడ్డి అన్నారు.  

ఎన్నికల్లో లబ్ధి  కోసమే అభయహస్తం

పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుకోసమే అభయహస్తం దరఖాస్తుల పేరిట కాంగ్రెస్ సర్కారు కొత్త డ్రామాకు తెరలేపిందని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని చెప్పారు. దరఖాస్తులు స్వీకరిస్తూ ప్రజలను ప్రభుత్వం అయోమయానికి గురిచేస్తోందన్నారు.

తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నా కావాలని ఎఫ్ఐఆర్ నంబర్ దరఖాస్తులో అడుగుతున్నారన్నారు. రేషన్ కార్డులే ఇవ్వకుండా నంబర్ వెయ్యుమంటే ఎక్కడి నుంచి వేస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.  అన్ని వివరాలు సర్కార్ వద్దే ఉన్నప్పుడు అమాయక ప్రజలను ఎందుకూ తిప్పుతున్నారన్నారు.