మృతుల కుటుంబాల‌కు రూ. 20 లక్షల నష్టపరిహారం ప్ర‌క‌టించాలి

మృతుల కుటుంబాల‌కు రూ. 20 లక్షల నష్టపరిహారం ప్ర‌క‌టించాలి

హైదరాబాద్: నగరంలో భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వరద బాధితులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. ఎల్బీనగర్ పరిధిలోని బైరామల్ గూడ చెరువు కింది ముంపు ప్రాంతాలైన‌ రెడ్డి కాలని, సాగర్ ఎన్‌క్లేవ్ , వనస్థలిపురం, హరిహర పురం కాలనీ… కప్పల చెరువు కింది ప్రాంతాలతో పాటు హయత్ నగర్ లోని బంజారా కాలనీలో పర్యటించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో సంజయ్ మాట్లాడుతూ.. దొరల పాలన గడీలు బద్దలు కొట్టే రోజు దగ్గరలో ఉంద‌ని అన్నారు.

వ‌ర‌ద‌ల కార‌ణంగా మృతి చెందిన వారి కుటుంబాల‌కు 20 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించాలని, పంట నష్టపోయిన రైతులందరిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు సంజ‌య్. 6 ఎకరాల ఉన్న బైరామల్ గూడ చెరువు ప్రస్తుతం 2 ఎకరాలు ఉందని, ఆక్రమణలకు గురైన చెరువుల గురించి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదన్నారు. ప్రజలు నీళ్లలో ఉంటే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ఉంటే ప్రజల బాధలు ఎలా తెలుస్తాయని ప్ర‌శ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాలనీల మధ్య కొట్లాటలు అవుతున్నాయని అన్నారు

ఓ ప్రక్క ప్రజలు వర్షం లో తడిసి ఇబ్బంది పడుతుంటే మ‌రో ప్రక్క సీఎం ధరణి వెబ్ సైట్ లో అధికారులను బెదిరించి నమోదు చేసుకుంటున్నార‌ని అన్నారు. కేసీఆర్ పనీతిరుని ప్రజలంతా గమనిస్తున్నారని… అదే ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని అన్నారు. ప్రస్తుతం నగరంలో కార్ల‌న్నీ నీళ్లలోనే ఉన్నాయని, వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో కారుని నీళ్లలో ముంచడం ఖాయమ‌న్నారు