
- చేవెళ్లలో ఆ పార్టీ స్టేట్చీఫ్ రాంచందర్‌రావు అరెస్ట్
- పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట.. ఉద్రిక్తత
చేవెళ్ల, హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. ‘సేవ్ హైదరాబాద్’ పేరుతో శుక్రవారం బీజేపీ సెక్రటేరియెట్ ముట్టడికి ప్రయత్నించడంతో ఆ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరులో పల్లె పల్లెకు బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రాంచందర్‌రావు పాల్గొని మాట్లాడారు. అనంతరం సెక్రటేరియెట్ముట్టడికి బయల్దేరిన ఆయన్ను చేవెళ్ల-–మొయినాబాద్ మధ్య మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకొని మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అరెస్ట్‌ను నిరసిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట, హైదరాబాద్–బీజాపూర్ హైవేపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టి సొంత పూచీకత్తుపై రాంచందర్‌రావును విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాకాలంలో నగరంలో వర్ష బీభత్సాన్ని చూశామని, అధికారులు అప్రమత్తంగా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురైన్నట్లు చెప్పారు. సమస్యలను తీర్చడంలో ప్రభుత్వం చేతులేత్తేసిందని ఆరోపించారు. విద్యుత్ షాక్‌తో పలువురు మృతిచెందారని విమర్శించారు.
సెక్రటేరియెట్ వద్ద నేతల అరెస్ట్
సెక్రటేరియెట్ ముట్టడికి ప్రయత్నించిన పలువురు బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారందరినీ అరెస్టు చేసి, వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ముట్టడి యత్నంలో చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు, గౌతమ్ రావు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు బీజేపీ నేతలను ముందస్తు హౌస్అరెస్టు చేశారు.