రాష్ట్ర అప్పులు పెరుగుతున్నయ్: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

రాష్ట్ర అప్పులు పెరుగుతున్నయ్: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు రోజురోజుకు తగ్గుతున్నాయని, అప్పులు మాత్రం పెరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆమెతో చర్చించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు కూడా కాకముందే రూ.12,905 కోట్ల అప్పు చేసింది. ఇలా అప్పులు చేస్తూ పోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. 

పాత అప్పులు కట్టడానికి కొత్తగా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు పొందగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున రుణాలు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. అంతేకాకుండా బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే నడుస్తూ విలువైన భూములను అమ్మాలని చూస్తున్నది” అని కేంద్రమంత్రికి వివరించినట్టు తెలిపారు. రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించే విధంగా కొత్త రూల్స్ తీసుకురావాలని కోరినట్టు చెప్పారు.