నస్పూర్, వెలుగు: సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.55 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ఈ నెల 30న సీసీసీ కార్నల్ లో ధర్నా నిర్వహిస్తున్నామని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.
సింగరేణి సంస్థ ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు కార్మికుల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సింగరేణి కార్మికుల ఆరు ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగరేణి వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, అందులో 40 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కమలాకర్ రావు, సీనియర్ నేత బెర సత్యనారాయణ, నస్పూర్ అధ్యక్షుడు కుర్ర చక్రవర్తి, చిరంజీవి, పొన్నవేని సదయ్య, ఆర్.శ్రీనివాస్, శ్రీరాంపూర్తి మహిళా మోర్చా అధ్యక్షురాలు రేణుక, ప్రధాన కార్యదర్శి బొంగోని శిరీష, సృజన తదితరులు పాల్గొన్నారు.
