కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్టే

కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్టే
  • బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు

సూర్యాపేట, వెలుగు :  కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్‌‌ఎస్‌కు వేసినట్లేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో  నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీఆర్‌‌ఎస్‌ ఒక్కటేనని, గతంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బీఆర్‌‌ఎస్‌, బీజేపీ కలిసి ఏనాడూ పోటీ చేయలేదన్నారు. ప్రజలు ఎప్పుడో మరిచిపోయిన కాంగ్రెస్ పార్టీని టీవీ చానల్స్‌, సోషల్ మీడియాలో జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారని  ఎద్దేవా చేశారు. 

60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దేశం, రాష్ట్రానికి చేసిందేమీ లేదని, తొమ్మిదేళ్ల మోడీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.  వరంగల్‌  రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో తెలంగాణలో  5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.  వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.  వరంగల్‌లో ప్రధాని బహిరంగ సభకు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.