బీజేపీ ట్విస్ట్: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్

బీజేపీ ట్విస్ట్: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. శాసనసభాపక్ష సమావేశంలో మోహన్ యాదవ్ పేరును ఖరారు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. 

మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2013లో  తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మోహన్ యాదవ్.. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.  మోహన్ యాదవ్ కు బలమైన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది.  

మరోవైపు డిప్యూటీ సీఎంలుగా ఇద్దరికి అవకాశం కల్పించింది బీజేపీ హైకమాండ్. డిప్యూటీ సీఎంలుగా జగదీష్ దేవ్డా, రాజేష్ శుక్లాను ప్రకటించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా నరేంద్ర సింగ్ తోమర్ను నియమించారు.

మధ్యప్రదేశ్ సీఎం రేసులో ప్రహ్లాద్ పటేల్, నరేంద్ర సింగ్ తోమర్, వీడీ శర్మ, జ్యోతిరాధిత్య సింధియా,కైలాష్ విజయ వర్గీయ వంటి పలువురు ప్రముఖులు పోటీ పడ్డారు. ఇందులో కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామాలు కూడా చేశారు. మధ్యప్రదేశ్ సీఎం ను ప్రకటించేముందు బీజేపీ హైకమాండ్ భోపాల్ కు పరిశీకుల బృందాన్ని పంపింది. ఈ బృందంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, ఆశా లక్రా, కె.లక్ష్మణ్ ఉన్నారు. తొమ్మిది రోజుల మేథోమథనం తర్వాత బీజేపీ అధిష్టానం అందరిని ఆశ్చర్యపర్చేలా అనూహ్యంగా మోహన్ యాదవ్ పేరును సీఎంగా ప్రకటించింది.