ఒక్కో ఎంపీ స్థానానికి ముగ్గురి పేర్లు..ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ

ఒక్కో ఎంపీ స్థానానికి ముగ్గురి పేర్లు..ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ
  • ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే లోక్‌‌సభ ఎన్నికలకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం తుది జాబితాను రూపొందించింది. తెలంగాణలోని 17 లోక్‌‌సభ స్థానాల్లో..  సిట్టింగ్ సీట్లు మినహా మిగిలిన స్థానాలకు కనీసం ముగ్గురి చొప్పున పేర్లను ఖరారు చేసింది. శుక్రవారం ఢిల్లీలోని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నివాసంలో పార్టీ స్టేట్‌‌ ఎలక్షన్‌‌ కమిటీ భేటీ జరిగింది. ఇందులో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జనరల్ సెక్రటరీ బండి సంజయ్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, గరికపాటి మోహన్ రావు పాల్గొన్నారు. ఈ భేటిలో నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల పేర్లను పరిశీలించారు. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ సీట్లలో సిట్టింగ్‌‌లు అయిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌‌లకే ప్రయారిటీ ఇచ్చారు. ఆదిలాబాద్ నుంచి మాజీ మంత్రి రమేశ్ రాథోడ్‌‌తో పాటు పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. మిగతా చోట్ల మూడు, నాలుగు పేర్లను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ పేర్లను ఆధారంగా తయారు చేసిన తుది లిస్ట్‌‌ను శుక్రవారం పార్టీ హైకమాండ్‌‌కు సమర్పించారు. అయితే త్వరలో జరగనున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఫస్ట్ మీటింగ్‌‌లో ఈ లిస్ట్‌‌లోని పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. 

హాట్ సీట్‌‌గా మల్కాజిగిరి..

దేశంలోని అతిపెద్ద లోక్‌‌సభ స్థానంగా ఉన్న మల్కాజిగిరి స్థానానికి బీజేపీ నుంచి చాలా మంది సీటు ఆశిస్తున్నారు. ఇందులో ఈటల రాజేందర్, మురళీధర్ రావు, కూన శ్రీశైలం గౌడ్, కొమురయ్య, హరీశ్‌‌ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి ఉన్నారు. మహబూబ్‌‌నగర్ నుంచి జితేందర్ రెడ్డి, డీకే అరుణ, శాంత కుమార్‌‌‌‌ ట్రై చేస్తున్నారు. నాగర్ కర్నూల్ నుంచి బంగారు శ్రుతి, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ పేరు పరిశీలనలో ఉంది. నల్గొండ సీటును బీసీ ఈక్వెషన్‌‌లో కేటాయించాలని పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ లెక్కన అసెంబ్లీ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీచేసి ఓడిన పిల్లి రామరాజు యాదవ్ పేరు వినిపిస్తోంది. చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం నుంచి ఇటీవల పార్టీలో చేరిన వ్యాపారవేత్త వినోద్ రావు, జహీరాబాద్ నుంచి ఎల్లారెడ్డి, సుభాశ్‌‌ రెడ్డి పేర్లు లిస్ట్‌‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అసదుద్దీన్ బరిలో ఉండే హైదరాబాద్ నుంచి ముస్లిం అభ్యర్థియే పోటీ చేస్తారనే ప్రచారం ఉంది.