
- 42 శాతం బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లోకి తీసుకురావడం అసాధ్యం
- అసెంబ్లీలో మమ్మల్ని నమ్మించి మద్దతు పొందారు
- మా పార్టీలోనూ గొడవలున్నయ్.. గీత దాటితే ఎవరైనా వేటు తప్పదని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లోకి తీసుకురావడం అసాధ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. అందుకు సుప్రీంకోర్టు గత తీర్పులు అనుమతించవని చెప్పారు. అలాగే, మతపరమైన, రాజకీయపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని పేర్కొన్నారు. ఈ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను నమ్మించి మద్దతు పొందిందన్నారు. ఆనాడు 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పలేదని, ఇప్పుడు రిజర్వేషన్లు అమలు చేయమంటే అసాధ్యమైన పనిని కేంద్రంపైకి నెట్టివేస్తున్నారన్నారు.
రిజర్వేషన్లపై న్యాయపర చిక్కులు ఉన్నాయని తెలిసి.. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, కేంద్ర- రాష్ట్ర పార్టీ సమన్వయ కర్త నూను బాల్ రాజ్ తో కలిసి రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీ పర్యటనకు వచ్చి.. పార్టీ ముఖ్య నేతలు సునీల్ బన్సల్, అర్వింద్ మీనన్, నితిన్ గడ్కరీ తో భేటీ అయినట్టు చెప్పారు. మంగళవారం పార్లమెంటులో బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నట్టు తెలిపారు.కేంద్రంపై నిందలు అన్యాయం..
బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేయడం అన్యాయమని రాంచందర్ రావు అన్నారు. హైకోర్టు చివాట్లు పెట్టేంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్‌పై ఆలోచించలేదని విమర్శించారు. ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో బిల్లు తెచ్చారు. ఈ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. కానీ, ఆర్డినెన్స్ రాకముందే, అందులో 10% ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కుట్ర చేయడం బాధాకరం. ఓ వైపు కేసీఆర్ తెచ్చిన 4% ముస్లిం రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండగా.. తాజా మతపర రిజర్వేషన్లు ఎలా అమలు అవుతాయి”అని ఆయన ప్రశ్నించారు.
ఏ పార్టీలో గొడవల్లేవ్?
తమ పార్టీలోనూ గొడవలు ఉన్నాయని రాంచందర్ రావు అంగీకరించారు.‘బీఆర్ఎస్ లో కవిత–-కేటీఆర్, కాంగ్రెస్ లో సీఎం– కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య గొడవల్లేవా? గొడవలు ఎక్కడ లేవు’అని పశ్నించారు. క్రమశిక్షణ లైన్ దాటితే వేటు తప్పదని పార్టీ నేతలను హెచ్చరించారు. బీఆర్ఎస్ ది రిజక్టెడ్ స్టోరీ అని, కేసీఆర్ ఫాంహౌస్ దాటి వస్తేనే.. ఆ పార్టీకి వెలుతురని కామెంట్ చేశారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మథర్ ఆఫ్ ఆల్ లైవ్స్( అన్ని అబద్ధాలకు తల్లి) అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.