ఎమ్మెల్యేలను విడగొట్టుడు ఏం రాజకీయం ?

ఎమ్మెల్యేలను విడగొట్టుడు ఏం రాజకీయం ?
  • బీహార్ సీఎం నితీశ్ కుమార్
  • మణిపూర్‌‌‌‌లో జేడీయూ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడంపై ఫైర్

న్యూఢిల్లీ: మణిపూర్‌‌‌‌లో జేడీయూకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరడంపై ఆ పార్టీ చీఫ్​ నితీశ్ కుమార్ మండిపడ్డారు. పార్టీల నుంచి ఎమ్మెల్యేలను విడగొట్టడం రాజ్యాంగబద్ధమా అని ప్రశ్నించారు. బీహార్‌‌‌‌ రాజధాని పాట్నాలో రెండు రోజుల నేషనల్ కాంక్లేవ్ జరుగుతున్నది. శనివారం జేడీయూ పార్టీ ఆఫీసు బయట మీడియాతో నితీశ్ మాట్లాడారు.

‘‘ఎన్డీయేతో మేం తెగదెంపులు చేసుకున్నప్పుడు.. మణిపూర్‌‌‌‌కు చెందిన మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు మమ్మల్ని కలిశారు. జేడీయూతోనే ఉంటామని చెప్పారు. కానీ వాళ్లు (బీజేపీ) పార్టీల నుంచి ఎమ్మెల్యేలను విడగొడుతున్నారు. ఇది రాజ్యాంగబద్ధమా? అసలు ఏం జరుగుతున్నదో మనం ఆలోచించాలి. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏకమవుతాయి” అని చెప్పారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు చేతులు కలిపితే.. ప్రజల తీర్పు చాలా బాగుంటుందని అన్నారు.

అప్పుడు అరుణాచల్.. ఇప్పుడు మణిపూర్

అరుణాచల్‌‌ ప్రదేశ్‌‌లో జేడీయూకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. 2020లో ఆరుగురు బీజేపీలో చేరారు. వారం కిందట మిగిలిన ఆ ఎమ్మెల్యే కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మణిపూర్‌‌‌‌లో జేడీయూకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఐదుగురు శుక్రవారం బీజేపీలో చేరారు. వీరి విలీనాన్ని కన్ఫమ్ చేస్తూ మణిపూర్ అసెంబ్లీ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారు. కొన్నిరోజుల కిందట ఎన్డీయే నుంచి బయటకొచ్చి, కాంగ్రెస్​– ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

బీహార్‌‌‌‌లోనూ జేడీయూ మిగలదు: సుశీల్ మోడీ

‘‘మణిపూర్‌‌‌‌లో ఐదుగురు‌‌ జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఇప్పుడీ రాష్ట్రం జేడీయూ నుంచి ఫ్రీ అయింది. ఆ ఎమ్మెల్యేలు ఎన్డీయేలోనే ఉండాలని అనుకున్నారు. రానున్న రోజుల్లో బీహార్‌‌‌‌నూ జేడీయూ నుంచి ఫ్రీ చేస్తం. పోస్టర్లు పెట్టుకుని, హోర్డింగ్‌‌లు ఏర్పాటు చేసుకుని ఎవ్వరూ ప్రధాని కాలేరు” అని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ అన్నారు.  ‘‘అరుణాచల్ ప్రదేశ్‌‌ తర్వాత.. మణిపూర్ కూడా జేడీయూ నుంచి ఫ్రీ అయింది. అతి త్వరలోనే లాలూజీ.. బీహార్‌‌‌‌ను జేడీయూ నుంచి ఫ్రీ చేస్తారు” అని ట్వీట్ చేశారు. 

పగటి కలలే..: జేడీయూ

పగటి కలలు కనవద్దంటూ బీజేపీపై జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ మండిపడ్డారు. 2024 లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీని కూకటివేళ్లతో పెకిలించి వేస్తామని హెచ్చరించారు. అరుణాచల్ ప్రదేశ్‌‌లో సంకీర్ణ ధర్మానికి బీజేపీ కట్టుబడి ఉండలేదని ఆరోపించారు. 
‘‘2015 ఎన్నికల సమయంలో బీహార్‌‌‌‌లో ప్రధాని మోడీ 42 సభలు నిర్వహించారు. కానీ 243 సీట్లు ఉన్న బీహార్‌‌‌‌లో 53 సీట్లు మాత్రమే బీజేపీ గెలవగలిగింది. 2024లో జుమ్లేబాజీల నుంచి దేశం విముక్తి పొందుతుంది.. జస్ట్ వెయిట్” అని అన్నారు. బీజేపీ బలవంతంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను చీల్చిందని దుయ్యబట్టారు.