కలెక్టర్లతో మద్యం అమ్మించే పనిలో ఉన్నారు

కలెక్టర్లతో మద్యం అమ్మించే పనిలో ఉన్నారు
  • తెలంగాణలో 6 లక్షల 80 వేల మంది మద్యంకు బానిసలైన కుటుంబాలు ఉన్నాయని తాజా సర్వే చెబుతోంది
  • ఏడాదికి 40 వేల కోట్ల మద్యం ఆదాయం ఉందని చెప్పుకునే సిగ్గులేని ప్రభుత్వం టీఆర్ఎస్ది
  • గోల్ మాల్ చేయాలనుకున్నప్పుడు.. ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకున్నప్పుడే కేసీఆర్ మీడియా ముందుకు వస్తారు
  • మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

మహబూబ్ నగర్: తెలంగాణలో 6 లక్షల 80 వేల మంది మద్యంకు బానిసలైన కుటుంబాలు ఉన్నాయని తాజా సర్వే చెబుతోందని, ఏడాదికి 40 వేల కోట్ల మద్యం ఆదాయం ఉందని చెప్పుకునే సిగ్గులేని ప్రభుత్వం టీఆర్ఎస్ది అని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెల్లడించారు. కలెక్టర్లతో మద్యం అమ్మించే పనిలో ఉన్నారని, అందుకే వీటిపై సమీక్షలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న పబ్ కల్చర్ ను బీజేపీ రూపుమాపుతుందని చెప్పారు. జిల్లా కేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్ లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ 8 సంవత్సరాల ప్రజా సంక్షేమ పాలన సదస్సు జరిగింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మాచారి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ సదస్సుకు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోల్ మాల్ చేయాలనుకున్నప్పుడు.. ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకున్నప్పుడే కేసీఆర్ మీడియా ముందుకు వస్తారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవటం..బీజేపీ గెలవడం ఖాయమని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఒకసారి టీఆర్ఎస్ ఓడిపోతే మళ్లీ గెలవదని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కు నేను..నా కుటుంబం అనే ఆహం పెరిగిందని విమర్శించారు. తెలంగాణ సంపదకు ప్రజలే యజమానులని, కేసీఆర్ కాదు అని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో 600 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేశారో కేసీఆర్ చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, ప్రమాదంలో చనిపోయిన వారిపై లేని ప్రేమ పంజాబ్ రైతులపై ఎందుకు చూపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎవరబ్బ సొమ్మని 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దేశ వ్యాప్తంగా ప్రకటనలు ఇచ్చావని ఈటల రాజేందర్ నిలదీశారు. ఫ్యూడల్ రాజకీయ మనస్ధత్వం గల వ్యక్తి కేసీఆర్ కు పోయేకాలం వచ్చిందని ఆయన జోస్యం చెప్పారు. ప్రజానాడి తెలిసిన ప్రజానాయకుడికి ప్రశాంత్ కిశోర్ (పీకే) అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ రాష్ట్రంలో ఆరిపోయే దీపం లాంటిందన్నారు. పోలీసులు పాలకులకు వత్తాసు పలికి తలదించుకునేలా వ్యవహరించవద్దని సూచించారు. కాంగ్రేస్ కు ఓటవేస్తే..టీఆర్ఎస్ కు వేసినట్టేనని,  అలా చేస్తే మళ్లీ సీఎం కేసీఆరే అవుతారు జాగ్రత్త అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.