తెలంగాణలో బీజేపీకి వచ్చేవి రెండు సీట్లే : సీఎం రేవంత్​రెడ్డి

తెలంగాణలో బీజేపీకి వచ్చేవి రెండు సీట్లే :  సీఎం రేవంత్​రెడ్డి
  • దేశవ్యాప్తంగా వచ్చేవి 240 లోపే..
  • పదేండ్లలో మభ్యపెట్టడం తప్ప మోదీ చేసింది ఏముంది?: సీఎం రేవంత్​రెడ్డి
  • బీజేపీని గెలిపించేందుకు బీఆర్​ఎస్​ సుపారీ తీసుకుంది
  • చట్ట ప్రకారమే కేసీఆర్​ అండ్​ కో అవినీతిపై చర్యలు 
  • భార్యాభర్తల ఫోన్లను కూడా గత సర్కార్​ ట్యాప్​ చేసింది
  • రావణుడు ఉన్నంత కాలం రాముడు ఉంటడు.. 
  • కేసీఆర్​ ఉన్నంత కాలం నేను ఉంట
  • కుక్కలను, పిల్లులను నేను కొట్టను.. కొడితే సింహాన్నే కొడ్త
  • కవిత అరెస్టు ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపదు
  • తండ్రి పేరు చెప్పుకోకుంటే కేటీఆర్​ చప్రాసీ కూడా కాలేడు
  • ఇండియా టీవీ ‘ఆప్​ కీ అదాలత్​’లో సీఎం కామెంట్స్​

హైదరాబాద్​, వెలుగు: దేశంలో బీజేపీకి 240 సీట్లు కూడా వచ్చే చాన్స్​ లేదని, నిరుద్యోగులు మోదీపై కోపంతో రగిలిపోతున్నారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. పదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడం తప్ప చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీకి రెండు ఎంపీ సీట్లకు మించి రావన్నారు. కేసీఆర్​ కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా ఎమ్మెల్యే సీట్లు వస్తాయని కలలు కన్నారని, కానీ జనం తీర్పు ఏమొచ్చిందో అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. చట్టప్రకారమే కేసీఆర్​ అండ్​ కోపై చర్యలు ఉంటాయని, పదేండ్లలో బీఆర్​ఎస్​ నేతలు చేసిన అవినీతి బయటకు వస్తున్నదని చెప్పారు. తీవ్రవాదులపై వాడాల్సిన ఫోన్​ ట్యాపింగ్​ను రాజకీయ నాయకులపై, బంధువులపై, భార్యాభర్తలపై కూడా గత కేసీఆర్ ​ప్రభుత్వం వాడిందని, ఈ కేసులో ఎవరున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను తండ్రి పేరు చెప్పుకొని సీఎం కాలేనని, కార్యకర్తల పోరాటం, ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చానని చెప్పారు.

తండ్రి పేరు చెప్పుకోకుంటే కేటీఆర్​ కనీసం చప్రాసీ కూడా కాలేరని రేవంత్​ రెడ్డి విమర్శించారు. ‘ఇండియా టీవీ’ చీఫ్ ఎడిటర్ రజత్‌ శర్మ నిర్వహించిన ‘ఆప్‌ కీ అదాలత్‌’ షోలో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొని ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇచ్చారు. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో అటు జాతీయ రాజకీయాలతో పాటు తెలంగాణలో ఉన్న పరిస్థితులు, తన రాజకీయ ప్రస్థానంపై తనదైన శైలిలో స్పందించారు. గంటసేపు జరిగిన ఈ షో.. ‘రేవంత్‌ రెడ్డి రోర్స్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)’ పేరుతో శనివారం రాత్రి ప్రసారమైంది. 

రజత్ శర్మ: కేసీఆర్ ప్రభుత్వం మిమ్మల్ని జైలుకు పంపించింది కదా.  ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు కనిపిస్తున్నది? 

సీఎం రేవంత్​: లేదు. కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవడమెక్కడిది. అసలు ప్రారంభించనే లేదు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేయటం మొదలుపెట్టాను. 

రాహుల్ పప్పు.. రేవంత్ తెలంగాణ పప్పు అని కేటీఆర్ అంటున్నరు కదా..? 
కరెక్ట్. అందులో తప్పేముంది. పప్పు. దాల్.. అందులో ప్రోటీన్ ఉంటుంది. పోషకాహారం. మేమేమీ హెరాయిన్, గాంజా లాంటి మాదక ద్రవ్యాలం కాదు కదా!

గతంలో మీరు డ్రగ్స్ అంబాసిడర్ అని కేటీఆర్​ను అన్నారు..?

వైట్ చాలెంజ్​కు సిద్ధమా? అని సవాల్​ చేస్తే వాళ్లు పారిపోయారు. తెలంగాణ సమాజం నుంచి డ్రగ్స్ నిర్మూలించాలని.. గతంలో నేను వైట్ చాలెంజ్​కు పిలుపునిచ్చాను. బ్లడ్ అండ్ హెయిర్​ శాంపిల్ పరీక్షలకు రావాలని కోరాను. వాళ్లు పారిపోయారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడి వరకు వచ్చింది? 

ఫోన్ ట్యాపింగ్ పై కేసు దర్యాప్తులో ఉంది. గత ప్రభుత్వానికి ఖాసీం రజ్వీగా పని చేసిన ఎస్ఐబీ చీఫ్ విదేశాలకు పారిపోయిండు. తీవ్రవాదులు, దేశ విద్రోహ శక్తుల ఫోన్లను ట్యాప్ చేయటం తప్పు లేదు.  అనుమతి తీసుకొని చట్టబద్ధంగానే  అట్ల ట్యాప్ చేసే వీలుంది. కానీ.. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బంధువులు, భార్యాభర్తల ఫోన్లను కూడా గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం వదల్లేదు. 

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్​ను అప్పట్లో మీరెందుకు తిట్టారు..? 

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఒకసారి హైదరాబాద్​కు వచ్చినప్పుడు కేటీఆర్​ను మెచ్చుకున్నారు.  తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కాంగ్రెస్ నాయకులు కష్టపడి.. జైళ్ల పాలై పోరాడుతున్న సమయమది. అప్పుడు తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు ఆయనను తిట్టాల్సి వచ్చింది.  

400 ప్లస్​ సీట్లు అని బీజేపీ చెప్తున్నది. మీరేమంటరు? 

మోదీ నేతృత్వంలోని బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు రావాలంటే ఒక్క భారతదేశంలో పోటీ చేస్తే సరిపోదు. పాకిస్తాన్‌లో కూడా ఆ పార్టీ పోటీ చేయాలి. గత ఎన్నికల్లో బీజేపీ యూపీ, ఢిల్లీ, బీహార్‌ తదితర రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలుచుకుంది. ఈసారి ఆ రాష్ట్రాల్లో అన్ని సీట్లు రావు. కమలనాథులకు ఈసారి 200–-240 సీట్లకు మించవు. దక్షిణాదిన ఉన్న 129 సీట్లలో బీజేపీకి కర్నాటకలో 10, తెలంగాణలో రెండు సీట్ల కంటే ఎక్కువ వచ్చే చాన్స్​ లేదు. అలాంటప్పుడు దేశవ్యాప్తంగా 400 సీట్లు ఎక్కడికెంచి వస్తయ్​? కేసీఆర్‌ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు  100కు పైగా సీట్లు వస్తాయని అనుకున్నడు. కానీ.. జరిగిందేమిటి? బీఆర్​ఎస్​కు వచ్చినయ్​ 39 సీట్లు మాత్రమే. రాజకీయ నాయకులు గెలిచే వాతావరణం సృష్టించేందుకు వాట్సాప్‌ యూనివర్సిటీల్లో ప్రచారం కోసం గొప్పలు చెప్పుకోవడం సహజం. మోదీ ఇంతకాలం గెలిచింది వాట్సాప్‌ యూనివర్సిటీల్లోనే. ఈసారి ప్రజలు ఆలోచిస్తున్నారు. 

మీరు ఇంగ్లిష్​లో తక్కువ.. హిందీ పర్​ఫెక్ట్ కదా?

గవర్నమెంట్​ స్కూల్లో చదువుకొని వచ్చాను. అందుకే ఇంగ్లీష్​లో అనర్గళంగా మాట్లాడలేను. తెలంగాణ ప్రాంతంలో నిజాం సర్కారు ఉండేది. ఉర్దూ, హిందీ ప్రభావముండేది. ఎంపీగా ఉన్నప్పుడు లోక్​సభలో మాట్లాడాల్సి వచ్చేది. అందుకే హిందీలో  మాట్లాడగలుగుతాను.

ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో కేసీఆర్ కూతురు కవితను అరెస్ట్ చేయటం వల్ల బీఆర్ఎస్​కు సానుభూతి లభిస్తుందా..? 

తెలంగాణలో జరిగిన అవినీతికి కవితను అరెస్టు చేయలేదు. ఢిల్లీలో జరిగిన అవినీతి విషయంలోనే  అరెస్టు చేశారు. కేసీఆర్‌ను అరెస్టు చేసి ఉంటే తెలంగాణ ఎన్నికల్లో ఏమైనా ప్రభావం ఉండేది. కానీ, కవిత అరెస్టు ఏ మాత్రం ప్రభావం చూపదు. కవిత అరెస్టుకు, తెలంగాణ ఎన్నికలకు ఎలాంటి సంబంధం ఉండదు. అసలు ఈ అంశంపై చర్చ కూడా జరగదు. 

మీరు అంగీలాగు ఊడదీసి చర్లపల్లి జైలుకు పంపుతానని కేసీఆర్​ను హెచ్చరిస్తున్నరు కదా? ఎందుకనీ?
 

ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేనా.. (ఇటుకకు రాయి తోనే సమాధానం చెప్పాలి కదా). అంతకుముందు రోజు కేసీఆర్ నాపై, మా మంత్రులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే అలా మాట్లాడాల్సి వచ్చింది. జైలుకు పంపడమే కాదు.. జైల్లోనే డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని కూడా అన్నాను. కేసీఆర్‌ వయసు అయిపోయింది. ఆయన వేరే చోట.. కొడుకు మరో చోట.. కూతురు, అల్లుడు ఇంకోచోట వేర్వేరుగా ఉంటున్నారు. ఇదంతా బాధాకరంగా ఉంది. అందుకే చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి ఇస్తే.. అందరూ ఒకేచోట కలిసి ఉంటారు. నేను ఎలాంటి వ్యక్తినో మీరైనా అర్థం చేసుకోండి. నేను రెండుసార్లు చర్లపల్లి జైల్లో ఉన్నా. నా కూతురు ఎంగేజ్మెంట్​కు కూడా పోలీసు అనుమతితోనే వెళ్లాను. అదే రోజు చెప్పిన. ‘‘కేసీఆర్.. నీకు ఇలాంటి పరిస్థితి వస్తే తెలుస్తుంది’’ అని.  అదే నిజమైంది. విధి బలమైంది. కవిత జైల్లో ఉండాలని నేను కోరుకోలేదు. నా కోపం కేవలం కేసీఆర్​పైనే. రావణుడు ఉన్నంతకాలం రాముడు.. కేసీఆర్‌ ఉన్నంత కాలం రేవంత్‌ ఉంటాడు.  

ఇప్పుడు మీరు సీఎం కాబట్టి..వాళ్లను వదిలిపెట్టరా..? 

అటువంటిదేమీ లేదు.  కేసీఆర్‌,  కేటీఆర్‌ని కొట్టాలనుకుంటే నాకు ఇవేమీ అవసరం లేదు. నేనే అసెంబ్లీకి వెళ్లి కొట్టగలను.  దీని కోసమే అయితే ఈ కుర్చీ అవసరం లేదు.

తమిళనాడు, తెలంగాణలో కూడా జనం మోదీ, మోదీ అంటున్నారు కదా..? 
 

సినిమాలో అప్పుడప్పుడూ జోకులు, కామెడీ కూడా ఉంటే బాగుంటుంది. 

దక్షిణాది నుంచి ప్రధాని ఎవరుండాలనుకుంటున్నరు?

రానున్న రోజుల్లో దక్షిణాది వాళ్లే ప్రధాని అవుతారు. కాంగ్రెస్‌కు అఖిల భారత స్థాయిలో అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే దక్షిణాదికి చెందిన వారే. రాహుల్‌ గాంధీ కూడా దక్షిణాదిలోని వయనాడ్​ నుంచి పోటీ చేస్తున్నారు. మోదీ హయాంలో   42 మంది తెలుగు ఎంపీల్లో ఒక్కరినే కేంద్రంలో కేబినెట్‌ మంత్రిని చేశారు. కానీ, గుజరాత్‌లో 28 మంది ఎంపీలు ఉంటే ఏడుగురిని, యూపీలో 62 మంది ఎంపీల్లో ప్రధాని సహా 16 మందిని మంత్రులను చేశారు. ప్రధానమంత్రి, హోంమంత్రి, స్పీకర్‌, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ అందరూ ఉత్తరాది వారే. దక్షిణాదికి ఏమిచ్చారు? దక్షిణాది దేశంలో భాగం కాదా? హిందుస్తాన్‌లో లేదా? దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు. అయినా వెంకయ్య నాయుడును ఉత్తరాది నుంచి గెంటేశారు. 

సింహం పడుకొని ఉంది... బయటకు వస్తుంది..
అప్పుడు  చూసుకుందాం అని అంటున్నారు కదా..? 
సింహం రావాలనే చూస్తున్నా. తుపాకీ సిద్ధంగా
ఉంది. ఒక్క తూటా చాలు. పిల్లులు, కుక్కలను
నేను కొట్టను. కొడితే సింహాన్నే కొడుత.
ఎన్నికల్లో ఓడగొట్టి చూపించాను కదా. 

కేజ్రీవాల్ అరెస్టుపై ఏం చెప్తారు? 

కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. అందువల్ల ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడంలో తప్పేమీ లేదు. రెండేండ్లుగా కేసులు నడుస్తుంటే ఎన్నికల సమయంలో ఎందుకు అరెస్టు చేశారు? ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే భయంతోనే అరెస్ట్ చేశారు. రెండు నెలల తర్వాత అరెస్టు చేసి ఉంటే కొంప మునిగేది కాదు కదా? సాక్ష్యాధారాలుంటే రెండేండ్లుగా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆధారాలు లేకుంటే ఎన్నికల సమయంలో ఎందుకు అరెస్ట్ చేశారో మోదీజీ సమాధానం చెప్పాలి. అవినీతికి శిక్ష పడకూడదని నేను అనట్లేదు. కానీ ఎలా అరెస్టు చేశారో140 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. ఇది దేశానికి మంచిదా? వంద కోట్ల రూపాయలు మద్యం వ్యాపారుల నుంచి తీసుకుని గోవా, పంజాబ్‌ ఎన్నికల్లో ఉపయోగించారనేది కేజ్రీవాల్ మీద ఉన్న అభియోగం. 

అదే మద్యం వ్యాపారి అరెస్టు అయిన తర్వాత ఎన్నికల బాండ్ల రూపంలో రూ.400-–500 కోట్లు బీజేపీకి ఇచ్చారు కదా. బీజేపీ వైట్‌లో తీసుకుంది. వారు బ్లాక్‌లో తీసుకున్నారు. రెండింటికీ తేడా ఏముంది? దీని ప్రభావం ఎన్నికలపై తప్పకుండా ఉంటుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏ పార్టీకి ఎవరు ఎంత డబ్బు ఇచ్చారనేది ప్రజలకు తెలిసిపోయింది. రూ.22,500 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలు వసూలు చేస్తే నాలుగేండ్లలో రూ.6,780 కోట్లు బీజేపీకి వచ్చాయి. బీజేపీకి నిధులిచ్చినవారంతా ఎవరు? వారంతా ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా! 

బీజేపీకి, బీఆర్‌ఎస్​కు,టీఎంసీకీ తేడా ఏమున్నది?  

బీజేపీకి, ఇతర అవినీతి పార్టీలకూ తేడా లేదు. ఏబీవీపీలో పనిచేసిన కాలం నుంచీ బీజేపీని చూస్తున్నా. ప్రతి ఎన్నికల ముందు బీజేపీ ఒక ఎజెండాను ఖరారు చేస్తుంది. కానీ మొదటిసారి బీజేపీ ఖరారు చేసిన ఎజెండా ప్రకారం ఎన్నికల్లోకి వెళ్లడం లేదు. మోదీ నాయకత్వంలో బీజేపీ పట్టాలు తప్పింది. 2024 ఎన్నికల్లో రామమందిరం పేరుతో ఎన్నికల్లోకి వెళ్లాలని నిర్ణయం జరిగింది. కానీ మందిర నిర్మాణం పూర్తికాగానే సోరెన్‌, కేజ్రీవాల్‌లను అరెస్టు చేశారు. ఇప్పుడు టీవీలన్నింటా రామమందిరం బదులు అరెస్టుల గురించి చర్చ జరుగుతోంది. అవినీతిపరులను వదిలిపెట్టబోనని, అందర్నీ జైలుకు పంపిస్తానని మోదీ అంటున్నారు. అలా అయితే హిమంత బిశ్వ శర్మ, జ్యోతిరాదిత్య సింధియా, నవీన్‌ జిందాల్‌, అశోక్‌ చవాన్‌, అజిత్‌ పవార్‌పై కూడా కేసులు ఉన్నాయి కదా? వారిని ఎందుకు జైలుకు పంపలేదు? ఈడీ కేసులున్నవారందరూ బీజేపీలో చేరిన వెంటనే మహాత్ములయ్యారా? వారందర్నీ పక్కన పెట్టుకుని తాను అవినీతికి వ్యతిరేకినని మోదీ అంటున్నారు. మోదీ అవినీతిపరుడని నేను అనడం లేదు. కానీ ఆయన పక్కన ఉన్నవారి సంగతేంటీ? అవినీతిపరులను లోపలికి పంపిస్తానని మోదీ అంటే బీజేపీలోకి పంపించడమేనా!

కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లింలీగ్ మేనిఫెస్టోలా ఉందంటున్నరు కదా? 

ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ఈ దేశంలో భాగస్వాములా? కాదా? అని మోదీని ప్రశ్నిస్తున్నా. ఇండియన్ పీనల్ కోడ్ అందరికీ వర్తిస్తుంది. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆచరణ సాధ్యం కాదు. ఒక్కో ప్రాంతం, ఒక్కో జాతిలో ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ హయాంలోనే అయోధ్యలో మొదటిసారి శిలాన్యాస్ పూజలు మొదలయ్యాయి. ఇప్పుడు మోదీజీకి అందులో ఇచ్చింది.. తెచ్చిందేంటీ? నేను సీఎం అయ్యాక భద్రాద్రి రామాలయానికి వెళ్లాను. అక్కడికెందుకు మోదీజీ రాలేదు. నేను హిందువునని గర్వంగా చెప్పుకుంటాను. అలాగని ముస్లింలను, సిక్కులను వ్యతిరేకించను. అన్ని మతాలను గౌరవిస్తాను. ముఖ్యమంత్రి హోదాలో లౌకికత్వానికి కట్టుబడి ఉంటాను.   

బీఆర్‌ఎస్‌ నేతల్ని మీ పార్టీలో చేర్చుకుంటున్నారు కదా? మీరు కూడా వాషింగ్‌ మెషీన్‌ వాడుతున్నారా? 
 

మేమింకా వాషింగ్‌ మెషీన్‌ కొనుక్కోలేదు.

కాంగ్రెస్ అగ్ర నేతలెవరైనా తెలంగాణ నుంచి పోటీ చేస్తారా?

తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా, రాహుల్‌, ప్రియాంకను కోరాం. కానీ ఇప్పటివరకైతే ఒప్పుకోలేదు. వారి వల్లే తెలంగాణ వచ్చింది. వారు లేకపోతే వంద సంవత్సరాలైనా తెలంగాణ వచ్చేది కాదు. ఆ కుటుంబంపై ఉన్న గౌరవంతో వాళ్లను గెలిపించుకునేందుకు తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరాం.  

మీరు ఆస్తులమ్మి ఎన్నికల్లో పోటీ చేశారు కదా? 

ఒకటి రావాలంటే ఒకటి కోల్పోవాలి. ఆస్తులు కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. రాజకీయాల్లో అలా ఉండదు. నా ఆలోచనలో స్పష్టత ఉంది. అందుకే సీఎం కాగలిగాను. తెలంగాణ వస్తుందని 2009లోనే  అనుకున్న. నేను సీఎం అవుతానని అప్పుడే అనుకున్న. నా ఆలోచనలో స్పష్టత ఉంది. అందుకే సీఎం అయ్యాను. 

రాహుల్ ఎవరితో సఖ్యతగా ఉండరనే పేరుంది? మీతో ఎలా కలిశారు? 

రాహుల్ దగ్గరికి వెళ్లే నేతలందరూ ఏదో ఒక పర్సనల్ ఎజెండాతో వెళ్తారు. అందుకే ఆయన ఒకట్రెండు నిమిషాలకు మించి సమయం ఇవ్వరనే పేరుంది. ప్రజల ఎజెండా లేదా పార్టీ కార్యక్రమాలతో వెళ్తే ఆయన ఎప్పుడైనా వినేందుకు సిద్ధంగా ఉంటారు. నేను మొదటిసారి కలిసినప్పుడు పది నిమిషాలు టైమ్ ఇచ్చారు. కానీ నేను ప్రజలు, పార్టీ గురించి మాట్లాడితే గంటన్నర సమయం కేటాయించారు.  

టీడీపీని ఎందుకు వదిలేశారు? 

కేసీఆర్​తో కొట్లాడేందుకే టీడీపీ నుంచి బయటకు వచ్చాను. కాంగ్రెస్ లో చేరాను. నేను పదవుల కోసం రాలేదు. ప్రజల నేతగా ఉండాలని అనుకున్నాను. లీడర్ గా నిలబడ్డాను.

మోదీని ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అని రాహుల్‌ అంటుంటే.. మీరేమో ‘బడే భాయ్‌’ అంటున్నారు?

మీరు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. నేను సీఎం అయ్యాక తొలిసారి ప్రధాని మోదీ మా రాష్ట్రానికి వచ్చారు. మేమిద్దరమూ ఒకే వేదికపై కూర్చున్నాము. ప్రధానిగా ఆయన దేశానికే పెద్దన్న లాంటివారు. నాకే కాదు.. ఈ దేశంలో ముఖ్యమంత్రులందరికీ ఆయన బడే భాయ్‌ లాంటివారు. అందుకే ‘మీరు పెద్దరికం చూపాలి. మీరు గుజరాత్‌కు గిఫ్ట్‌ సిటీ తెచ్చారు. సబర్మతీ రివర్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. మా తెలంగాణకు కూడా మూసీ రివర్‌ ఫ్రంట్‌ ఇవ్వండి. మెట్రో రైలు ప్రాజెక్టుకు అభివృద్ధి కోసం ఎన్ని నిధులిచ్చి ‘బడే భాయ్‌’ అని నిరూపించుకోండి’ అని మోదీతో చెప్పాను.  

మోదీ ఎప్పుడూ 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడతారు. అది రావాలంటే దేశంలో ఐదు మెట్రోపాలిటన్‌ నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా.. అన్నీ అభివృద్ధి చెందాలి. ‘మోదీజీ.. మీరు తెలంగాణకు అన్యాయం చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులన్నీ భయపెట్టి, బెదిరించి గుజరాత్‌ కు తీసుకెళ్తున్నారు. అందుకే బడే భాయ్‌ లాగా మాకు మద్దతివ్వాలి’ అని కోరాను. ప్రధానితో ఆ రోజు జరిగిన  సమావేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధినేతల మధ్య సమావేశం. రాజకీయ నేతల మధ్య భేటీ కాదు.  కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలి. బీజేపీతో సైద్ధాంతిక పోరాటం చేస్తాను. వ్యవస్థలతో పోరాడదల్చుకోలేదు.  

అదానీని దొంగ అని రాహుల్ అంటే.. మీరేమో ప్రాజెక్టులు ఇచ్చారు?
 
ప్రభుత్వం నిర్మించిన రేవులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, నవరత్న సంస్థలను మోదీ అతి చౌకధరలకు అదానీకి కట్టబెట్టారు. మా ప్రభుత్వం అదానీ జేబులో ఉన్న డబ్బులతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టించింది. ఈ రెండింటికి తేడా ఉంది. తెలంగాణ ఆస్తులేవీ అదానీకి కట్టబెట్టలేదు. విద్యుత్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో అదానీ పెట్టుబడులు పెడుతున్నారు. అదానీ అయినా, అంబానీ అయినా, టాటా అయినా, బిర్లా అయినా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకొస్తే తప్పకుండా ఆహ్వానిస్తాను. తెలంగాణలో అదానీని దోపిడీ చేయనివ్వను.  పెట్టుబడిదారులకు నేను భరోసాగా నిలుస్తాను. గ్యారంటీ ఇస్తాను. కానీ, దోపిడీ మాత్రం చేయనివ్వను. పెట్టుబడికి, లూటీకి తేడా ఉంది. మోదీ ప్రభుత్వం అన్నింటినీ చౌకగా అదానీకి కట్టబెడుతోందని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు సరైనవే.

మహబూబ్‌ నగర్‌, చేవెళ్ల, మల్కాజ్​గిరి, భువనగిరి, జహీరాబాద్‌ సీట్లలో బీజేపీని గెలిపించేందుకు బీఆర్‌ఎస్‌ సుపారీ తీసుకుంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య అవగాహన ఒప్పందం ఉన్నది. సుపారీ తీసుకున్న వారికి నాపై మాట్లాడే అర్హత ఎక్కడుంది? అధికార దాహంతో బీజేపీలో చేరాలనుకుంటే 2017లోనే చేరి మంత్రినయ్యే వాడిని. ఇప్పుడు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నాకు బీజేపీలో చేరాల్సిన అవసరమేమున్నది? 17 సంవత్సరాలుగా ప్రతిపక్షంలోనే ఉన్న. ప్రజల మధ్యలో ఉండి రాజకీయంగా పోరాడి ముఖ్యమంత్రి అయ్యాను. ఎవరి దయాదాక్షిణ్యాలతో ఈ పదవిలోకి రాలేదు. కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్‌ కోటా. ఆయనతో నాకు పోలికేంది? తండ్రి పేరుతో కేటీఆర్‌కు నౌకరీ దొరికింది. లేకపోతే ఆయన తెలంగాణలో చప్రాసీ కూడా కాలేడు.