చత్తీస్​గఢ్ బీజేపీదే.. 2018తో పోలిస్తే కాషాయ పార్టీకి భారీగా పెరిగిన సీట్లు

చత్తీస్​గఢ్ బీజేపీదే.. 2018తో పోలిస్తే కాషాయ పార్టీకి భారీగా పెరిగిన సీట్లు

రాయ్​పూర్: చత్తీస్​గఢ్ ఓటర్లు కాంగ్రెస్​కు షాక్ ఇచ్చారు. బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించారు. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మొత్తం 90 స్థానాల్లో బీజేపీ 54 స్థానాల్లో, కాంగ్రెస్ 35 స్థానాల్లో, మరోచోట గోండ్యానా గణతంత్ర పార్టీ (జీజీపీ) విజయం సాధించాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే.. బీజేపీ సీట్లతో పాటు ఓటింగ్ షేర్ విషయంలో భారీగా పుంజుకుంది. పోయిన సారి ఎన్నికల్లో కాంగ్రెస్ 68 స్థానాల్లో, బీజేపీ 15 నియోజకవర్గాల్లో, బీఎస్పీ రెండు స్థానాల్లో, ఇతరులు 5 సెగ్మెంట్స్​లో గెలుపొందారు. దీంతో భూపేశ్ బాఘెల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ.. ఈ సారి ట్రెండ్ మారిపోయింది. మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలను దాటేసింది. దీంతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు లైన్ క్లియర్ అయింది.
45 వేల ఓట్ల మెజార్టీతో రమణ్ సింగ్ విక్టరీ కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎం భూపేశ్ బాఘెల్ పఠాన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి విజయ్ బాఘెల్​పైన 19వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. చిత్రకూట్​లో బీజేపీ అభ్యర్థి వినాయక్ గోయల్ తన 8వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ క్యాండిడేట్ దీపక్ కుమార్​పై విజయం సాధించారు. మాజీ సీఎం రమణ్ సింగ్ రాజ్​నందన్ గావ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గిరీశ్ దేవాంగన్​పైన 45వేల ఓట్ల భారీ మార్జిన్​తో గెలిచారు. దుర్గ్​ రూరల్ నుంచి కాంగ్రెస్ నేత తామ్ర ధ్వజ్ సాహుపైన బీజేపీ క్యాండిడేట్ లలిత్ చంద్రకర్ 15వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. అనంతనాగ్ నుంచి బీజేపీ అభ్యర్థి విక్రమ్ ఉసెండి ఓడిపోయారు. కొండన్​గావ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ పైన బీజేపీ క్యాండిడేట్ 18వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు.

రాష్ట్రమంతటా సంబురాలు

చత్తీస్​గఢ్ సైలెంట్ విక్టరీతో బీజేపీ నేతలు సంబురాలు చేసుకున్నారు. రాయ్​పూర్, బస్తర్, బలరాంపూర్, బీజాపూర్, బిలాస్​పూర్, కోబ్రా, ముంగేలీ, నారాయణ్​పూర్​తో పాటు పలు జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలు పటాకులు కాల్చి విషెస్ చెప్పుకున్నారు. స్వీట్లు పంచుకుంటూ నృత్యాలు చేశారు. అదేవిధంగా, ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద కూడా చత్తీస్​గఢ్ పార్టీ లీడర్లు సంబరాలు జరుపుకున్నారు. చత్తీస్​గఢ్​లో భారీ విజయం సాధించడంపై ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్​లో ఓటర్లకు అభినందనలు చెప్పారు. ఇది ప్రజల విజయమని ట్వీట్ చేశారు. బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన పార్టీ లీడర్లు, కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు చెప్పారు.