ప్రజలను తప్పుదోవ పట్టించి బీజేపీ గెలిచింది : అశోక్ గెహ్లాట్

ప్రజలను తప్పుదోవ పట్టించి బీజేపీ గెలిచింది : అశోక్ గెహ్లాట్

 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ.. ప్రజలను తప్పుదోవ పట్టించి గెలిచిందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. శుక్రవారం నుంచి కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ (కాంగ్రెస్) బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రజలకు సమస్యలు ఉంటే, తమ వద్దకు రావాలని, వారి సమస్యల పరిష్కారానికి ఏ ఒక్క చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టమని గెహ్లాట్ చెప్పారు. 

అలాగే, కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంపైనా ఆయన విరుచుకుపడ్డారు. "రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేవలం నెలన్నర రోజులు మాత్రమే అవుతోంది. కానీ, ఈ టైంలోనే మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు అనేకం జరిగాయి. ఎన్నికలకు ముందు ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ శాంతిభద్రతలు మెరుగ్గా ఉండేవి. కొత్త ప్రభుత్వం మన పరువు తీసింది”అని ఆయన ఫైర్​ అయ్యారు. ఎన్నికల టైంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నాయకులు అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారని గెహ్లాట్ విమర్శించారు. 

ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుని పశ్చాత్తాప పడుతున్నారని ఆయన అన్నారు. ఈ నెల 22న జరిగే రామమందిర శంకుస్థాపన కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయ కార్యక్రమంగా మార్చిందని గెహ్లాట్ మండిపడ్డారు. తాము కూడా రామ భక్తులమేనని, బీజేపీ నేతలు సృష్టిస్తున్న వాతావరణం మంచిది కాదని గెహ్లాట్ అన్నారు.