ఎమ్మెల్యే బాలరాజును తిట్టాడని బీజేపీ కార్యకర్తను చితకబాదిన్రు

ఎమ్మెల్యే బాలరాజును తిట్టాడని బీజేపీ కార్యకర్తను చితకబాదిన్రు
  • అచ్చంపేట పోలీసుల తీరు 
  • బీజేపీ నేతల ఒత్తిడితో బయటకు.. 
  • విచారించి విడిచిపెట్టామన్న సీఐ

అచ్చంపేట, వెలుగు :  వంద కోట్లకు నిన్ను ఎవరు కొంటారని అచ్చంపేట ఎమ్మెల్యేను ఫోన్​లో దూషించాడని ఆరోపిస్తూ గద్వాల జిల్లా గట్టు మండలం తప్పెట్ల మొరుసు గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త రామాంజనేయులును సోమవారం రాత్రి అచ్చంపేట పోలీసులు పీఎస్​కు తీసుకువచ్చి చితకబాదినట్టు తెలిసింది. దీంతో బీజేపీ లీడర్లు ​సతీశ్ మాదిగ , బాలాజీ, చందూలాల్ ​చౌహాన్, భరత్​చంద్ర పోలీస్​స్టేషన్​కు వెళ్లి బీజేపీ కార్యకర్తను అక్రమంగా తీసుకువచ్చి కొట్టడాన్ని ఖండించారు. వారి ఒత్తిడితో పోలీసులు రామాంజనేయులును మంగళవారం వదిలి పెట్టారు. 

ఈ సందర్భంగా సతీశ్​మాట్లాడుతూ ప్రశ్నించిన వారిని పోలీసులతో కొట్టిస్తూ ఎమ్మెల్యే  బాలరాజు వీధి రౌడీలీ ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. పోలీసులు ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారన్నారు. గతంలోనే కొడంగల్ ​ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని కూడా ఇలానే కొట్టారన్నారు. పోలీసులు ఎమ్మెల్యేకు ఊడిగం చేయడం సరికాదన్నారు. ఈ ఘటనపై అచ్చంపేట సీఐ అనుదీప్​ను వివరణ కోరగా ఎమ్మెల్యేను దూషించిన విషయంలో రామాంజనేయులును పీఎస్​కు తీసుకువచ్చి మంగళవారం వదిలి పెట్టామని, అతనిని కొట్టలేదని, కేవలం ప్రశ్నించామని చెప్పారు.