కేసీఆర్ కు వాస్తు ఏందో చూపిస్తం:జేపీ నడ్డా

కేసీఆర్ కు వాస్తు ఏందో చూపిస్తం:జేపీ నడ్డా
  • టీఆర్​ఎస్​ పాలనంతా కమీషన్లు, అవినీతిమయం..
  • ఎగ్జిబిషన్​ గ్రౌండ్​ బీజేపీ సభలో జేపీ నడ్డా ఫైర్​
  • రాష్ట్ర కేబినెట్​లో మహిళలకు చోటేది?
  • దళితుడ్ని సీఎం చేస్తానన్నావ్​.. ఏమైంది?
  • వాస్తు పేరిట సెక్రటేరియెట్​ కూల్చడమా?
  • కాళేశ్వరం ప్రాజెక్టు వెనుక భారీ స్కాం
  • ఆయుష్మాన్​ భారత్​ వద్దంటున్నావ్​.. మరి, ఆరోగ్యశ్రీ మాటేంది?
  • 2023లో రాష్ట్రంలో అధికారంలోకి
    వస్తామన్న బీజేపీ వర్కింగ్​ ప్రెసిడెంట్​
  • టీడీపీ, కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ నుంచి
    భారీగా చేరికలు

హైదరాబాద్​, వెలుగుకేసీఆర్​ తానేదో షెహన్​ షాలా ఫీలవుతున్నారని, నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని బీజేపీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జేపీ నడ్డా మండిపడ్డారు.  ‘‘నేను.. నేను.. నేను.. నా తర్వాత నా కుటుంబం. ఇదే కేసీఆర్​ పాలసీ. అధికారంలోకి వచ్చాక మిగతా వాళ్లెవరూ ఆయనకు కనిపించడం లేదు” అని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని, పక్కా వాస్తు అంటే ఏమిటో కేసీఆర్​కు అర్థమయ్యేలా చూపిస్తామని అన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని, కమీషన్ల కోసమే ఇక్కడి ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. బీజేపీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా ఎన్నికైన తర్వాత తొలిసారి నడ్డా ఆదివారం హైదరాబాద్​కు వచ్చారు. పార్టీ కేడర్​ ఘన స్వాగతం పలికింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్​ బేరర్ల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయాలపై సమీక్షించారు. సాయంత్రం నాంపల్లిలోని ఎగ్జిబిషన్​ గ్రౌండ్స్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ చరిత్రను, పోరాట యోధులను యాదికి తెచ్చుకొని నివాళులర్పించారు.  కేసీఆర్​ తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కుటుంబపాలన కొనసాగుతోందని, ఇది ఇంకెన్నాళ్లూ కొనసాగదని అన్నారు. ‘‘వాస్తు సరిగ్గా లేదని సెక్రటేరియెట్​ బిల్డింగ్​ను  కూలుస్తున్నారట. కేసీఆర్​కు పక్కా వాస్తు అంటే ఏమిటో 2023లో సరిగ్గా అర్థమవుతుంది. 25ఏండ్ల కింద కట్టిన సెక్రటేరియెట్​ బిల్డింగ్​ను కూల్చడం ఏంది? ఇది నియంతృత్వ పాలన కాకుంటే మరేంది? ఇది ప్రజాస్వామ్య సర్కారా?” అని నిలదీశారు. కోర్టులు అక్షింతలు వేసినా కేసీఆర్​ మారడటం లేదన్నారు. రాష్ట్ర కేబినెట్​లో మహిళలకు అవకాశం ఇవ్వకుండా అవమానించారని తెలిపారు. రాష్ట్ర కేబినెట్​లో ఎస్టీలకు కూడా  ప్రాతినిధ్యం లేదని, ఇది చిన్నవిషయం కాదని చెప్పారు.

అన్నిట్లో కమీషన్లు.. అవినీతి

కమీషన్ల కోసమే టీఆర్​ఎస్​ సర్కార్​ పనిచేస్తోందని నడ్డా ఆరోపించారు. ‘‘కేసీఆర్​ దగ్గరున్న గిన్నె నిండా రంధ్రాలుంటాయి. పైనుంచి ఎంత వేస్తే.. అంత కిందికి కమీషన్లుగా వెళ్తుంది” అన్నారు. వ్యక్తిగతంగా తాను  విమర్శించాలనుకోవడం లేదని చెప్పారు. రూ. 30వేల కోట్లతో పూర్తి చేయాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రెండింతలు పెంచి రూ. 80వేల కోట్లకు చేశారని, దీని వెనుక భారీ అవినీతి దాగి ఉందని ఆరోపించారు.  ‘‘కాళేశ్వరం అంటే ఎంతో పవిత్రమైన పేరు.  దానిని అవినీతి పనులతో భ్రష్టు పట్టిస్తున్నారు. రైతులను మోసం చేస్తున్నారు. రూ. 30 వేల కోట్లతో చేయాల్సిన ప్రాజెక్టును రూ. 80వేల కోట్లకు మార్చడం వెనుక ఎంత మోసం దాగి ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి” అని కోరారు. మిషన్​ కాకతీయ.. మిషన్​ ఫర్​ కమీషన్​గా మారిందన్నారు. నాడు భగీరథుడు ఆకాశం నుంచి గంగను భూమికి  చేరేలా చేస్తే.. ఇక్కడి  షెహన్‌షా భూమి మీదికి వచ్చిన నీటిని ప్రజల వద్దకు చేర్చలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు.  ‘‘డబుల్​ బెడ్రూం ఇండ్లు అన్నారు.. ఏమైంది? ఎన్ని ఇండ్లు కట్టించారు? హరితహారం పేరిట అంతటా ప్లాంటేషన్​ అన్నారు.. ఏమైంది? నాటిన మొక్కలెన్ని?! అందులో కూడా అవినీతే. రాష్ట్రంలో ఏ స్కీం కూడా సరిగా పనిచేయడం లేదు. ఇది అవినీతిపరుల సర్కార్.  పై నుంచి కిందిదాకా అవినీతిపరులే ఉన్నారు” అని నడ్డా దుయ్యబట్టారు. చెప్పేది ఒక్కటి చేసేది ఇంకొకటిలా  కేసీఆర్​ తీరు తయారైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే  దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్​.. తానే సీఎం అయ్యారని మండిపడ్డారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులు, పథకాలను కూడా సొంత ఖాతాలో వేసుకుంటున్నారని పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీ బకాయిల మాటేంది?

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్​ భారత్’  ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్​ కవరేజీ స్కీం అని నడ్డా తెలిపారు.  ప్రపంచ దేశాలు కూడా దాన్ని ప్రశంసిస్తున్నాయని, రాష్ట్రంలో కేసీఆర్​ మాత్రం దాన్ని అమలు చేయడం లేదన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 26 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరాల్సి ఉందని చెప్పారు.  ‘‘ఆయుష్మాన్​ భారత్​ గురించి పక్కనబెడుదాం.. మరి కేసీఆర్​ గొప్పగా చెప్తున్న ఆరోగ్యశ్రీ పథకం  పరిస్థితి ఏమైంది? బకాయిలు చెల్లించడం లేదని మెడికల్​ ఇనిస్టిట్యూట్లు​ స్ట్రయిక్​ చేస్తున్నాయి. జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇది కేసీఆర్​కు కనిపించడం లేదా? సీఎంకు ప్రజారోగ్యం పట్ల ఉన్న శ్రద్ధ ఇదేనా?” అని నిలదీశారు. తాము రాష్ట్రానికి ఆయుష్మాన్​ భారత్​ను ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే.. కేసీఆర్​ అడ్డుకుంటున్నారని, కమీషన్లు రావనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
‘‘మాకు ఇచ్చే మనసు ఉంది.. కానీ వాళ్ల (కేసీఆర్)​కు తీసుకునే మనసు లేదు” అని దుయ్యబట్టారు. తెలంగాణకు ఎయిమ్స్​ కావాలని జితేందర్​రెడ్డి వంటి కొందరు నేతలు తమ వద్ద ప్రతిపాదించగానే.. చట్టంలో లేకపోయినా మంజూరు చేశామన్నారు.  రాష్ట్రంపై బీజేపీకి ఉన్న అభిమానం ఎలాంటిదో ఎయిమ్స్​ ఉదాహరణ ఒక్కటి చాలని పేర్కొన్నారు.

తడాఖా చూపిస్తం

టీడీపీ, కాంగ్రెస్​ నుంచే కాకుండా టీఆర్​ఎస్​ నుంచి కూడా నేతలు బీజేపీలోకి వస్తున్నారని నడ్డా చెప్పారు. టీఆర్​ఎస్​లో నియంతృత్వాన్ని భరించలేకనే వలస వస్తున్నారన్నారు. బీజేపీలోకి వలసలు చూసి.. టీఆర్‌ఎస్‌ కడుపు మండుతోందన్నారు. మోడీ నాయకత్వంలో రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, అందరినీ కలుపుకొనిపోతామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని, తడాఖా చూపిస్తుందని అన్నారు. దేశంలో 17 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీలో కార్యకర్త కూడా ప్రధాని, చీఫ్​ అవుతాడు

దేశంలో 2300 రాజకీయ పార్టీలు ఉన్నాయని, ఆ పార్టీల్లో లేని గొప్పతనం బీజేపీలోనే ఉందని నడ్డా అన్నారు. సాధారణ కార్యకర్త కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం, పార్టీ చీఫ్​ అయ్యే అవకాశం ఒక్కే బీజేపీలోనే ఉందని, అందుకు మోడీ, అమిత్​ షానే ఉదాహరణ అని తెలిపారు. ఇతర పార్టీల్లో ‘‘నేను, నా బిడ్డ, నా బంధువులు..”అనే సిద్ధాంతమే ఉంటుందని, కాంగ్రెస్​ పార్టీలో మళ్లీ సోనియాగాంధీనే అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య బద్ధంగా నడిచే పార్టీ బీజేపీ ఒక్కటేనన్నారు.

ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం

70ఏండ్లలో ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని మోడీ సర్కార్​ చేసిందని, ఆర్టికల్​ 370ని రద్దు చేసి ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం అని చాటిచెప్పిందని నడ్డా పేర్కొన్నారు. ‘‘ఆర్టికల్​ 370ని టెంపరరీ అంటున్న పార్టీలు.. దాన్ని పర్మనెంట్​ ఎందుకు చేయలేకపోయాయి? ఆ ఆర్టికల్​ దేశానికి మంచిది కాదని తెలిసి కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పాకులాడాయి. మన్మోహన్​సింగ్​ అయినా సరే, గుజ్రాల్​ అయినా సరే హైదరాబాద్​ నుంచి పోటీ చేయొచ్చు.. ఇక్కడ ఓటు హక్కు పొందొచ్చు. మరి కాశ్మీర్​లో ఆ హక్కు ఎందుకు ఉండకూడదు. ఇదేం పద్ధతి. ఒక దేశంలో ఇద్దరు ప్రధానులు.. రెండు రాజ్యాంగాలు ఉండాలా? ఆర్టికల్​ 370 రద్దుతో దేశమంతా ఒక్కటేనని చాటిచెప్పాం” అని పేర్కొన్నారు. ట్రిపుల్​ తలాక్​ రద్దుతో ముస్లిం మహిళలు సగర్వంగా జీవించగలుగుతున్నారని తెలిపారు. ప్రజల కష్టాలు దూరం చేసేందుకు గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని సాహసోపేత నిర్ణయాలను మోడీ సర్కార్​ తీసుకుంటోందని, అదే బీజేపీని ప్రజలకు చేరువచేస్తోందని ఆయన అన్నారు. మోడీ నాయకత్వాన్ని విశ్వసించి వివిధ పార్టీల నేతలు బీజేపీలోకి వస్తున్నారని తెలిపారు. త్వరలో దేశం 5 ట్రిలియన్​ డాలర్​ ఎకానమీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జల్​ జీవన్ ద్వారా దేశంలోని ప్రతి ఇంటికీ మంచినీళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆవాస్​ యోజన కింద పేదలందరికీ ఇండ్లు కట్టిస్తున్నామని తెలిపారు. మహిళలను, కార్మికులకు.. ఇలా అన్నివర్గాలకు పథకాలు తీసుకువచ్చామని, అవినీతికి ఆస్కారం లేకుండా వాటిని అమలు చేస్తున్నామని చెప్పారు.