ఆర్టీసీ కార్మికులారా.. మీకు మేమున్నాం: లక్ష్మణ్

ఆర్టీసీ కార్మికులారా.. మీకు మేమున్నాం: లక్ష్మణ్

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు భారతీయ జనతాపార్టీ పూర్తి సహకారం ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులు అధైర్య పడాల్సిన అవసరం లేదని అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క కలం పోటుతో 50 వేల మంది ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వేటు వేశారన్నారు. ఏ కొలువుల కోసం అయితే రాష్ట్ర కొట్లాట జరిగిందో ఆ కొలువులనే ముఖ్యమంత్రి తొలగిస్తున్నారని అన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడంలో భాగంగానే కార్మికులపై వేటు వేశారన్నారు.

నాడు ఉద్యమ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులతో పెట్టుకుంటే అగ్గితో పెట్టుకున్నట్టే అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు అదే అగ్గితో పెట్టుకున్నారని లక్ష్మణ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకునే క్రమంలో ఇంటికో ఉద్యోగం అని రెచ్చగొట్టి, అధికారంలోకి వచ్చాక కేవలం తన కుటుంబాన్ని మాత్రమే ఉద్యోగాలతో నింపారని ఆయన విమర్శించారు.

ఏటా లక్ష ఇరవై వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి,  వారికి రక్షణగా ఉండే పోలీసు శాఖలోనే ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. కొత్త ఉద్యోగం దేవుడెరుగు… ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. భారత రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాల్సిన కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెరపైకి తెచ్చి పాలిస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు.

రాష్ట్ర ప్రజల సంపద దోపిడీకి గురవుతోందని, టిఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలు విసుగు చెందారన్నారు.  ఆర్టీసీని నష్టాల బారిన పడేసేందుకు కేసీఆర్ కారణం అయ్యారు. ఆర్టీసీ కార్మికులు అధైర్యపడొద్దని, తమ హక్కుల కోసం పోరాడమని, అందుకు బీజేపీ పూర్తి సహకారం అందిస్తుందని లక్ష్మణ్ చెప్పారు.  తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ పోరుబాట పడుతుందని ఆయన చెప్పారు.

BJP would fully support the RTC workers strike : k. lakshman