సీఏఏపై బీజేపీ భారీ సభ

సీఏఏపై బీజేపీ భారీ సభ

హైదరాబాద్‌‌లో నిర్వహించేందుకు ప్లాన్‌‌

హైదరాబాద్, వెలుగుసీఏఏకు అనుకూలంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 9 నుంచి 26 వరకు కార్యకర్తలతో మీటింగ్స్‌‌ నిర్వహించాలని బీజేపీ కోర్ కమిటీ నిర్ణయించింది. ఆ తర్వాత హైదరాబాద్‌‌లో భారీ బహిరంగ సభకు ప్లాన్‌‌ చేసింది. సభ ఎప్పుడు నిర్వహించాలనే దానిపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పింది. బీజేపీ స్టేట్‌‌ ఆఫీస్‌‌లో పార్టీ చీఫ్‌‌ లక్ష్మణ్ అధ్యక్షతన పార్టీ కోర్ కమిటీ మీటింగ్‌‌ మంగళవారం జరిగింది. పార్టీ లీడర్లు ఇంద్రసేనారెడ్డి, మంత్రి శ్రీనివాస్, డీకే అరుణ, పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రవీంద్ర నాయక్, సోమారపు సత్యనారాయణ, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇన్‌‌చార్జీలు పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త కనీసం 50 ఇళ్లకు వెళ్లి సీఏఏపై వివరించేలా చూడాలని మీటింగ్‌‌లో నిర్ణయించారు.

మున్సిపోల్స్‌‌లో బాగానే పోరాడినం

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైనా మీటింగ్‌‌లో చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలతో  పోల్చుకుంటే మున్సిపల్ ఫలితాలు సంతృప్తినిచ్చాయని నేతలు అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ అక్రమాలు చేసినా ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని  సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల టీఆర్ఎస్, కాంగ్రెస్ కన్నా బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచిందని, భైంసా వంటి మున్సిపాలిటీలో బీజేపీ 4  సీట్లు గెలిస్తే, టీఆర్ఎస్ ఖాతా తెరవలేదని అభిప్రాయపడ్డారు. తుక్కుగూడలో రాజ్యసభ సభ్యుడు కేకే దొంగ ఓటు వేయడంపై న్యాయ పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వెంటనే జిల్లా కమిటీలను ఎన్నుకోవాలని, సహకార ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఇది ఉద్యమాల సంవత్సరం: లక్ష్మణ్

బీజేపీకి 2020 ఉద్యమాల సంవత్సరమని, కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతిపై ఉద్యమిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కోర్‌‌ కమిటీ మీటింగ్‌‌ తర్వాత మీడియాకు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో అడ్డదారిన  టీఆర్ఎస్ గెలిచిందని, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నీతులు చెబుతున్నారని మండిపడ్డారు.  కేసీఆర్, ఒవైసీలు మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పకుండా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సీఏఏపై అసెంబ్లీ తీర్మానం చెల్లదని తెలిసి కూడా కేసీఆర్ తీర్మానం చేస్తామనడం రాజకీయ లబ్ధికోసమేనన్నారు.

మరిన్ని వార్తల కోసం..