కర్నాటక ఉప ఎన్నికల్లో బీజేపీ డబుల్​ సిక్సర్​

కర్నాటక ఉప ఎన్నికల్లో బీజేపీ డబుల్​ సిక్సర్​
  • కర్నాటక బైపోల్స్​లో ఘన విజయం 
  • 13 మంది పోటీ.. 12మంది గెలుపు
  • ఇక మూడున్నరేళ్లు సుస్థిర ప్రభుత్వమే
  • రాష్ట్రం అభివృద్ధిపై  దృష్టి పెడతం
  • ఫలితాల తర్వాత సీఎం యడియూరప్ప
  • కర్నాటక ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పారు: మోడీ

బెంగళూరు, హజారీబాగ్(జార్ఖండ్): కర్నాటక ఉప ఎన్నికల్లో బీజేపీ డబుల్​సిక్సర్​ కొట్టింది. 15 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 12 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్​ పది సిట్టింగ్​ స్థానాలను కోల్పోయి కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఇంకోచోట ఇండిపెండెంట్​అభ్యర్థి గెలిచారు. బైపోల్స్​లో జనతాదళ్(సెక్యులర్) ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవడానికి బీజేపీకి కనీసం ఆరు సీట్లు కావాల్సి ఉండగా.. పన్నెండు సీట్లను గెలుచుకోవడంతో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు. నాలుగు నెలల కిందట పార్టీ ఫిరాయించిన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్​ కూటమి ఎమ్మెల్యేలతో యడియూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్​ వేటువేయడంతో ఆయా స్థానాలకు ఎలక్షన్​ కమిషన్​ ఉప ఎన్నికలు నిర్వహించింది. స్పీకర్ నిర్ణయంతో మాజీలుగా మారిన ఆ ఎమ్మెల్యేలలో 16 మంది బీజేపీలో చేరారు. పార్టీ టికెట్​తో 13 మంది ఉప ఎన్నికల్లో పోటీ చేయగా.. అందులో 12 మంది గెలుపొందడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ ఆఫీసుల వద్ద స్వీట్లు పంచారు. మరోవైపు, బైపోల్స్​లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎల్పీ పదవికి సిద్దరామయ్య, పార్టీ​రాష్ట్ర చీఫ్​ దినేశ్​ గుండూరావు రాజీనామాచేశారు.

మిగతా రాష్ట్రాలకు ఇదో సందేశం: మోడీ

‘ప్రజాతీర్పును అవమానించిన వారికి కర్నాటక ఓటర్లు ప్రజాస్వామిక పద్ధతిలో జవాబు చెప్పారు’ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కర్నాటక బైపోల్స్​ ఫలితాలపై జార్ఖండ్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ స్పందించారు. ప్రజాతీర్పును స్వాగతిస్తున్నామని, ఇది దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఓ సందేశమని అన్నారు. ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా నడుచుకోవడమంటే ప్రజలను అవమానించడమేనని, అలాంటి వారికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని మోడీ అన్నారు.

ఆ ముగ్గురికీ మంత్రిపదవులు

ఉప ఎన్నికల ఫలితాలపై కర్నాటక సీఎం యడియూరప్ప సంతృప్తి వ్యక్తంచేశారు. వచ్చే మూడున్నరేళ్లు రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. జేడీఎస్​నుంచి పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు. దీనిపై హైకమాండ్​తో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్తానని యడియూరప్పచెప్పారు.

ప్రజా తీర్పును అంగీకరిస్తున్నా…

బైపోల్​ రిజల్ట్స్​పై కాంగ్రెస్​ సీనియర్ నేత డీకే శివకుమార్  స్పందిస్తూ.. “ప్రజల తీర్పును అంగీకరిస్తాం.. ఫిరాయింపుదారులను ప్రజలు అంగీకరించారు.  ఓటమిని అంగీకరిస్తున్నాం. దీనికి మేం బాధపడాల్సిన అవసరంలేదు” అని అన్నారు.

సీఎల్పీ పదవికి సిద్దరామయ్య రాజీనామా

అసెంబ్లీ బైపోల్స్ లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్​ లెజిస్లేచర్​పార్టీ (సీఎల్పీ) లీడర్​ పదవికి మాజీ సీఎం సిద్దరామయ్య సోమవారం రాజీనామా చేశారు. ఈమేరకు పార్టీ చీఫ్​ సోనియా గాంధీకి ఆయన లెటర్​ రాశారు. పార్టీ ప్రయోజనాల కోసమే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. సిద్దరామయ్య రాజీనామా ప్రకటన వెలువడిన కాసేపటికే  కర్నాటక కాంగ్రెస్​ చీఫ్​దినేశ్​ గుండూరావ్​ కూడా రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు.

BJP's double sixer in Karnataka by-election