హైదరాబాద్ అన్నోజిగూడ ఆర్వీకేలో రాష్ట్ర బీజేపీ నేతలకు మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఈ నెల 20, 21, 22 తేదీల్లో జరగనున్న తరగతుల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు బిజీ బిజీగా గడపనున్నారు. శిక్షణ తరగతుల్లో రాష్ట్ర నేతలకు జాతీయ నేతలు శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో జాతీయ నేత సుమారు 40 నుండి 50 నిమిషాలు పాటు క్లాస్ లు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. శిక్షణ తరగతుల్లో కొత్త, పాత నేతలు పాల్గొననున్నట్టు సమాచారం. పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు, లక్ష్యాలు, సంస్థాగత నిర్మాణం, రాజకీయ అంశాలు, పార్టీ బలోపేతంపై శిక్షణ తరగతుల్లో జాతీయ నేతలు వివరించనున్నారు. శిక్షణా తరగతులకు బీజేపీ జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, సహా ఇన్ ఛార్జ్ అరవింద్ మీనన్, శిక్షణ ఇచ్చే జాతీయ నిపుణులు హాజరుకానున్నారు.
ఎలక్షన్ ప్రిపరేషన్
రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. సాధారణ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండడంతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బలోపేతం కావాలని కమలం పార్టీ నిర్ణయించింది. బూత్ కమిటీలు, స్థానిక నాయకత్వం బలోపేతంపై ఇప్పటికే ఆ పార్టీ ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో బూత్ కమిటీల నియామకం పూర్తి చేయాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది. అగ్రనేతల ఆదేశాలతో బూత్ కమిటీల నియామకంపై రాష్ట్ర బీజేపీ కసరత్తు ప్రారంభించనుంది.
శిక్షణా తరగతుల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన కార్యదర్శిలతో ఆ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర బీజేపీ నేతలకు శిక్షణ తరగతులు, రాష్ట్రంలో మోడీ పర్యటన జరిగిన తీరు, తాజా రాజకీయ అంశాలపై చర్చించారు.
