జనగామలో మళ్లీ లొల్లి

జనగామలో మళ్లీ లొల్లి

చెదరగొట్టిన పోలీసులు 
జనగామ, వెలుగు:
 జనగామలో బీజేపీ, టీఆర్ఎస్​ లీడర్ల మధ్య మళ్లీ లొల్లి జరిగింది. బుధవారం టీఆర్ఎస్​చేసిన దాడులను ఖండిస్తూ బీజేపీ మౌన దీక్షకు పిలుపునివ్వగా పోలీసులు పర్మిషన్​ఇవ్వలేదు. అయితే గురువారం ఉదయం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్​రెడ్డి, సౌడ రమేశ్, గండి నాగరాజు తదితరులు జనగామ చౌరస్తాలోని అంబేద్కర్​ విగ్రహం వద్దకు చేరుకుని టీఆర్ఎస్​కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న టీఆర్ఎస్ ​లీడర్లు ఒక్కసారిగా బీజేపీ లీడర్ల వైపు దూసుకొచ్చారు. మోడీ డౌన్​డౌన్​అంటూ నినాదాలతో హోరెత్తించారు. జనగామ టౌన్, రూరల్​ సీఐలు బాలాజీ వరప్రసాద్, వినయ్​కుమార్​ బలగాలతో ఇరువర్గాలను చెదరగొట్టారు. పెనుగులాటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దశమంత్​రెడ్డి కిందపడిపోయారు. మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు చౌరస్తాకు చేరుకుని పార్టీ శ్రేణులకు సంఘీభావం తెలిపారు. అనంతరం పోలీసులు బీజేపీ శ్రేణులను పార్టీ జిల్లా ఆఫీస్​కు తరలించారు. కాసేపటి తర్వాత అక్కడి నుంచి ముందస్తు అరెస్టులు చేస్తూ పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్లారు.  
ఎక్కడికక్కడ అరెస్టులు 
జనగామలో శుక్రవారం సీఎం పర్యటన నేపథ్యంలో గురువారం బీజేపీ లీడర్లను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్​ చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్​ రెడ్డి చెప్పారు. తనను హౌజ్​ అరెస్ట్​ చేశారని అన్నారు. జనగామ జిల్లా హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​తీసుకుంటున్న 9 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు హైదరాబాద్​కు తరలించినట్లు చెప్పారు. పోలీసులు అరెస్ట్​ చేసిన తమ లీడర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ లింగాలఘన్​పూర్​ మండల కేంద్రంలో బీజేపీ యువమోర్చా లీడర్​ అంజి సాయంత్రం సెల్​ టవర్​ఎక్కి నిరసన తెలిపాడు. బీజేపీ లీడర్లు, పోలీసులు అతడికి సర్దిచెప్పడంతో 2 గంటల తర్వాత కిందకు దిగాడు. 

నర్మెట్టలో బీజేపీ లీడర్లపై దాడి
బచ్చన్నపేట, వెలుగు:
జనగామలో బుధవారం బీజేపీ నాయకులపై టీఆర్ఎస్​ కార్యకర్తల దాడిని నిరసిస్తూ నర్మెట్ట మండల కేంద్రంలో గురువారం కేసీఆర్​ దిష్టిబొమ్మ దహనం చేశారు. విషయం తెలిసి అక్కడకు వచ్చిన టీఆర్ఎస్​ కార్యకర్తలు జెండా కర్రలతో దాడి చేయడంతో బీజేపీ మండల అధ్యక్షుడు ధరావత్​రాజునాయక్, వెల్దండ గ్రామ బూత్​అధ్యక్షుడు శాచెల్లి రాజు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు బచ్చన్నపేట సర్కార్​ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి తలలకు బలమైన గాయాలవడంతో డాక్టర్లు కుట్లు వేశారు. హనుమకొండ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంతరెడ్డి, నాయకులు ఏవీఎల్​ఎన్​రెడ్డి, ముక్కెర తిరుపతిరెడ్డి సహా పలువురు బచ్చన్నపేట ఆసుపత్రికి చేరుకుని గాయపడినవారిని పరామర్శించారు. గాయనపడిన వారిని మెరుగైన ట్రీట్​మెంట్​కోసం గాంధీకి తీసుకెళ్లాలని డిమాండ్​ చేశారు. దాడికి గురైనవారు అక్కడే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. 

మరిన్ని వార్తల కోసం :

వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ చేస్తా