చండీగఢ్ మేయర్ పీఠం బీజేపీదే

చండీగఢ్ మేయర్ పీఠం బీజేపీదే
  • తొలి పోరులో ‘ఇండియా’ కూటమి ఓటమి

చండీగఢ్: ఇండియా కూటమికి చండీగఢ్ ​మేయర్ ఎన్నికల్లో షాక్ తగిలింది. మేయర్ ​పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. లోక్‌‌సభ ఎన్నికల ముందు తొలి పరీక్షగా భావించిన ఈ పోరులో ఇండియా కూటమి ఓటమిపాలైంది. మంగళవారం జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్‌‌ సోన్కర్‌‌ విజయం సాధించారు. ఈ ఎన్నికల కోసం ఆప్, కాంగ్రెస్‌‌ కలిసి పోటీ చేశాయి. మేయర్‌‌ పదవికి ఆప్‌‌, డిప్యూటీ మేయర్‌‌ పదవులకు కాంగ్రెస్‌‌ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాయి. పంజాబ్‌‌, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్‌‌ నిర్వహించగా, మేయర్‌‌ పదవి బీజేపీకి దక్కింది. ఆప్‌‌ అభ్యర్థి కుల్‌‌దీప్‌‌ కుమార్‌‌పై బీజేపీ నేత మనోజ్‌‌ సోన్కర్‌‌ గెలిచారు.

చండీగఢ్ ​మున్సిపల్​కార్పొరేషన్​లో మొత్తం 36 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో సోంకర్​కి 16 ఓట్లు, కుమార్​కు 12 ఓట్లు వచ్చాయి. ప్రిసైడింగ్​ఆఫీసర్​ 8 ఓట్లు చెల్లవని ప్రకటించారు. దీంతో ఆప్, కాంగ్రెస్​ అభ్యర్థులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆప్​ అభ్యర్థి కుల్దీప్ కుమార్ ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయాడు.​ చుట్టుపక్కల వారు ఆయనను ఓదార్చి కన్నీళ్లు తుడిచారు. అనంతరం సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలను ఆప్, కాంగ్రెస్​బహిష్కరించాయి. దీంతో బీజేపీ అభ్యర్థులు కుల్జిత్ సంధు, రాజిందర్ శర్మ విజయం సాధించారు.