కేసీరావు, కేటీరావు.. ప్రజలకు ఏమీ రావు

కేసీరావు, కేటీరావు.. ప్రజలకు ఏమీ రావు

తార్నాక: బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు,  ఎంపీ తేజస్వీ సూర్య ఓయూ పర్యటన గందరగోళంగా మారింది. మంగళవారం ఉదయం తేజస్వీ సూర్య పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలతో ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నారు. వర్సిటీలోకి పాదయాత్రన వెళ్తున్న తేజస్వీని ఎన్సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో గేట్లు దూకి బీజేపీ కార్యకర్తలు లోపలికి వెళ్లారు. 1969 తెలంగాణ అమరులను స్మరించుకోవడానికి తేజస్వీ ఓయూకు వెళ్లారు. ఈ సందర్భంగా తేజస్వీ మాట్లాడుతూ.. తెలంగాణలో మహత్తర మార్పులకు, విప్లవానికి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రమని అన్నారు. అమరులను స్మరించుకోవడానికి వస్తే కేసీఆర్ తన అధికార బలంతో పోలీసులను పెట్టి తమను ఆపడానికి యత్నించారని ఫైర్ అయ్యారు.

‘తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ జాగీర్ కాదు. ఈ రాష్ట్రం ఇక్కడి ప్రజలది, యువతది. బంగారు తెలంగాణ తీసుకొస్తానని కేసీఆర్ అన్నారు. కానీ టీఆర్‌‌ఎస్ పార్టీని మాత్రమే బంగారుమయం చేశారు. ఆ పార్టీ నేతలకే బంగారం దక్కింది. యువతకు ఏమీ ఇవ్వలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలు తెలంగాణ ప్రజల స్వాభిమానం, భవిష్యత్, ఆత్మగౌరవానికి సంబంధించినవి. దీని కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమే. కేసీఆర్ తెలంగాణను అవినీతిమయంగా మార్చారు. ఇక్కడ జరుగుతోంది ఒక్కటే.. కేసీరావు, కేటీరావు, ప్రజలకు ఏమీ రావు. ప్రధాని మోడీ అంటే కేసీఆర్‌‌కు, టీఆర్ఎస్‌‌కు భయం పట్టుకుంది. మోడీ జనాకర్షణకు వాళ్లు వణుకుతున్నారు. మోడీ నాయకత్వంలో కొత్త హైదరాబాద్, సరికొత్త తెలంగాణను మేం నిర్మిస్తాం’ అని తేజస్వీ పేర్కొన్నారు.