
- నేడు పార్టీ స్టేట్ ఆఫీసులో భేటీ
- రేపు నడ్డా ఆధ్వర్యంలో కౌన్సిల్ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో వరుస పర్యటనలు చేసిన ప్రధాని మోదీ.. తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించారు. ఇదే ఊపును కొనసాగించేలా గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసు బేరర్ల మీటింగ్ జరగనుంది. దీనికి బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
పార్టీ స్టేట్ ఆఫీసులో ఉదయం 10కు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, మురళీధర్ రావుతో పాటు ఆఫీసు బేరర్లు, అన్ని జిల్లాల అధ్యక్షులు, ఇన్ చార్జులు పాల్గొంటారు. ఇందులో శుక్రవారం జరగనున్న స్టేట్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయనున్న అజెండా అంశాలపై చర్చించనున్నారు.
తెలంగాణకు మోదీ వరాలు ప్రకటించడం, వాటికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ప్రధానికి ధన్యవాదాలు తెలిపే అంశంతో పాటు రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై చర్చించనున్నారు. ఈ తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ సర్కార్ ప్రజలను ఎలా మోసం చేసింది? వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఏం చేయాలనుకుంటున్నాం? అనే దానిపై డిస్కస్ చేయనున్నారు.
కాగా, ఈ నెల 10న కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ ఖరారైంది. ఆయన బహిరంగ సభను ఎక్కడ నిర్వహించాలనే దానిపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంపై కూడా జిల్లాల వారీగా బీఎల్ సంతోష్ సమీక్ష చేయనున్నారు.
కౌన్సిల్ మీటింగ్ కు 800 మంది..
హైదరాబాద్‌లోని ఘట్కేసర్లో ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో శుక్రవారం బీజేపీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. దీనికి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మీటింగ్ కు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 800 మంది ముఖ్య నేతలు హాజరుకానున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు నడ్డా దిశానిర్దేశం చేయనున్నారు.
వరుసగా అగ్ర నేతల టూర్లు..
బీజేపీ అగ్ర నేతలు వరుసగా రాష్ట్రానికి వస్తూ క్యాడర్ లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ నెల 1, 3 తేదీల్లో మోదీ పర్యటించారు. ఈ నెల 5న బీఎల్ సంతోష్, 6న జేపీ నడ్డా, 10నఅమిత్ షా రానున్నారు. 12 న బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగళూర్ ఎంపీ తేజస్వీ సూర్య రానున్నారు.