బ్లాక్ బాక్స్ డేటానే కీలకం!.. అందులోని సమాచారంతోనే ప్రమాదానికి కారణాలు తెలిసే చాన్స్

బ్లాక్ బాక్స్ డేటానే కీలకం!.. అందులోని సమాచారంతోనే ప్రమాదానికి కారణాలు తెలిసే చాన్స్

న్యూఢిల్లీ:  ఎయిరిండియా బోయింగ్  787–8 డ్రీమ్ లైనర్  విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్  కీలకంగా మారనుంది. పైలట్ల సమాచారం అంతా బ్లాక్ బాక్స్ లోనే రికార్డు కావడంతో తదుపరి దర్యాప్తులో బ్లాక్ బాక్సుల పాత్ర కీలకం కానుంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో అధికారులు వీటి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మెకానికల్  ఫెయిల్యూర్, ఇంజిన్  మాల్ ఫంక్షనింగ్, పక్షులు ఢీకొనడం, విమానంలో మంటలు, మానవ తప్పిదం వంటివి ప్రమాదానికి కారణలుగా భావిస్తున్నారు. ఈ వివరాలన్నీ బ్లాక్ బాక్సులో రికార్డయి ఉంటాయి. ఫ్లైట్  టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్లు ‘మేడే’ కాల్ ఎందుకు చేశారో తెలుసుకోవడానికి బ్లాక్ బాక్సులు సహకరిస్తాయి. ప్రమాదానికి గురైన విమాన బ్లాక్ బ్లాక్సులు దొరికితే వాటిని ఫోరెన్సిక్  ల్యాబరేటరీస్  లేదా ఎయిర్ క్రాఫ్ట్  యాక్సిడెంట్  ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు పంపుతారు. అక్కడ నిపుణులు ఆ బ్లాక్ బాక్స్ లోని డేటాను రికవరీ చేసి డీకోడ్  చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి కొద్ది రోజులు లేదా వారాలు పట్టవచ్చు.

అసలేంటీ బ్లాక్ బాక్స్?

ఒక విమాన ప్రమాదానికి దారితీసిన కారణాలు, సంఘటనల గురించి సెకండ్ టు సెకండ్  ఇన్ఫర్మేషన్ ను బ్లాక్ బాక్సులు రికార్డు చేస్తాయి. సాధారణంగా ప్రతి కమర్షియల్  ఫ్లైట్ లో రెండు బ్లాక్ బాక్సులు ఉంటాయి. ఆరెంజ్  కలర్ లో ఉండే ఇవి క్రాష్  రెసిస్టెంట్లు. అంటే విమానం ఎలాంటి ప్రమాదానికి గురైనా బ్లాక్ బాక్సులు మాత్రం చెక్కు చెదరవు. ఆవిధంగా వాటిని తయారు చేస్తారు. పేలుడు, అగ్నిప్రమాదం, వాటర్  ప్రెజర్, హైస్పీడ్  క్రాషెస్  వంటి వాటిని ఇవి తట్టుకుంటాయి. తాజాగా ప్రమాదానికి గురైన బోయింగ్ 787 వంటి ఆధునిక విమానాల బ్లాక్ బాక్సుల్లో ప్రతి సమాచారం రికార్డవుతుంది. 

కాక్ పిట్  కమాండ్  ఇన్ పుట్స్  నుంచి ఎయిర్ కండిషనింగ్  సిస్టమ్స్  వరకు వీటిలో డేటా నమోదవుతుంది. కాక్ పిట్  ఆడియో పైలట్  సంభాషణ, రేడియో ట్రాన్స్ మిషన్స్, వార్నింగ్  అలార్మ్ వంటి సమాచారాన్ని కాక్ పిట్  వీడియో రికార్డర్  (సీవీఆర్) క్యాప్చర్  చేస్తుంది. విమానం ప్రమాదానికి గురవడానికి చివరి క్షణాల డేటా అంతా బ్లాక్ బాక్స్ లోనే రికార్డు అవడంతో దర్యాప్తులో ఈ డేటానే కీలకం అవుతుంది. 25 గంటల సమాచారాన్ని సీవీఆర్ లు స్టోర్  చేసుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన మేజర్  ఫ్లైట్ క్రాష్ కు గల కారణాలను తెలుసుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషించాయి.