జాతి రత్నాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్

జాతి రత్నాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్
  • జాతి రత్నాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్
  • వారం క్రితం పోలీసులకు తప్పుడు ఫిర్యాదు
  • జ్యోతిష్కుడు అరెస్ట్.. రూ. 18 కోట్ల ఫేక్ కరెన్సీ స్వాధీనం

ఎల్​బీనగర్,వెలుగు:  జాతి రత్నాల చోరీ కేసు దర్యాప్తులో ఎల్​బీనగర్ పోలీసులకు కొత్త ట్విస్ట్ ఎదురైంది. కంప్లయింట్ ఇచ్చిన జ్యోతిష్కుడు రంగురాళ్ల ముసుగులో ఫేక్ కరెన్సీ దందా చేస్తున్నట్లు  గుర్తించారు. జ్యోతిష్కుడు తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు తేల్చారు. నిందితుడిని అరెస్ట్ చేసి  రూ. 18 కోట్ల ఫేక్ కరెన్సీ, రూ.6 లక్షల 32 వేల క్యాష్, కారు, లక్షన్నర విలువైన సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  ఏపీలోని పిడుగురాళ్లకు చెందిన జ్యోతిష్కుడు మురళీకృష్ణ(35) టెన్త్ వరకు చదివాడు. జాతకం కోసం తన దగ్గరకి వచ్చే వారికి  రంగురాళ్లు అమ్మేవాడు. మురళీకృష్ణ కొంతకాలం క్రితం నాగోల్ పరిధి బండ్లగూడలో ఓ ఇల్లు రెంట్​కు తీసుకున్నాడు.  ఈ నెల 14న ఇంట్లో రూ. 40 లక్షల విలువైన డైమండ్స్,  రంగురాళ్లు చోరీకి గురైనట్లు ఎల్​బీనగర్ పీఎస్​లో కంప్లయింట్ చేశాడు. మురళీకృష్ణ దగ్గర పనిచేసే గుంటూరుకి చెందిన పవన్(28), రామకృష్ణ(24), విజయ్ (27), సూర్యం(25), నాగేంద్ర(32) చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

పవన్​​ను పిడుగురాళ్లలో అదుపులోకి తీసుకుని విచారించగా తాము ఎలాంటి డైమండ్స్, రంగురాళ్లను తీసుకెళ్లలేదన్నాడు. చోరీ తర్వాత  తాము కొట్టేసిన బ్యాగ్​ను ఓపెన్ చేసి చూస్తే అందులో  నకిలీ నోట్లు ఉన్నాయన్నాడు. ఫేక్ కరెన్సీని నార్కట్ పల్లి వద్ద పెట్రోల్ పోసి తగులబెట్టామన్నాడు. పవన్ స్టేట్ మెంట్ ఆధారంగా జ్యోతిష్కుడు మురళీకృష్ణను పోలీసులు విచారించారు. డైమండ్స్, రంగురాళ్ల చోరీ జరగలేదని మురళీకృష్ణ ఒప్పుకున్నాడు. జ్యోతిష్యం ముసుగులో తాను నకిలీ కరెన్సీతో హవాలా బిజినెస్ చేస్తున్నట్లు చెప్పాడు.  2019లో ఓ బ్యాంక్​ను మోసం చేసేందుకు స్కెచ్ వేసిన మురళీకృష్ణను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రిలీజైన తర్వాత   మురళీకృష్ణ సిటీకి వచ్చి ఫేక్ కరెన్సీ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మురళీకృష్ణతో పాటు అతడి దగ్గరి పనిచేస్తూ చోరీ చేసిన ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు.