మామిడి తోటలకు నల్లతామర తెగులు

మామిడి తోటలకు నల్లతామర తెగులు

నాగర్ కర్నూల్, వెలుగు: అంతర్జాతీయంగా గుర్తించి పొందిన కొల్లాపూర్ మామిడికి నల్ల తామర తెగులు నష్టం చేస్తోంది. వరుసగా మూడో ఏడాది కూడా రోగం సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  పూత నల్లగా మారి తెట్టెలు తెట్టెలుగా రాలిపోతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.  లక్షలు ఖర్చుపెట్టి క్రిమిసంహారక మందులు స్ప్రే చేస్తున్నా ఫలితంఉండడం లేదని వాపోతున్నారు. వాతావరణ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా గత రెండేళ్లగా నష్టాల్లోనే ఉన్నామని, ఈ సారైనా గట్టెక్కుతామనుకుంటే తామర రోగం దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కొల్లాపూర్‌‌‌‌లో 35 వేల హెక్టార్లలో..

ఉమ్మడి జిల్లాలో మామిడి సాగు 50 వేల హెక్టార్లు ఉండగా..  ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 35 వేల హెక్టార్లలో తోటలు ఉన్నాయి.  బంగినపల్లి, నూజివీడు తర్వాత కొల్లాపూర్ బేనిషాకు ఆస్థాయిలో అంతర్జాతీయ గుర్తింపు ఉండడంతో ఇక్కడి రైతులు మామిడి వైపే మొగ్గు చూపుతున్నారు.  సొంత పొలం ఉన్న రైతులే కాదు కౌలు రైతులు కూడా లక్షలు ఖర్చు పెట్టి  తోటలు సాగు చేస్తున్నారు.  మార్కెట్‌‌లో డిమాండ్‌‌ బాగుండడంతో ఇదివరకు లాభాలు కూడా బాగానే ఉండేవి. కానీ, మూడేళ్ల కింద నల్ల తామర తెగులు సోకి దిగుబడి తగ్గడంతో నష్టాలు మొదలయ్యాయి. ఈ పురుగు పూతలోని రసం పీల్చేస్తుండడంతో రాలిపోతోంది.  పిందెలు ఉన్నచోట పసుపు రంగులోకి మారి రాలిపోతున్నాయి.  

ఈ మందులు వాడండి: హార్టికల్చర్ ఆఫీసర్ లక్ష్మణ్

రైతుల ఫిర్యాదుతో హార్టికల్చర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ లక్ష్మణ్‌‌ ఇటీవల మామిడి తోటలను పరిశీలించి.. పలు మందులు సూచించారు.  వాతావరణంలో మార్పు, మంచు కారణంగా నల్ల తామర, బూడిగ తెగుళ్లు సోకి పూత రాలుతోందని చెప్పారు. పూతను ఒక పేపర్‌‌‌‌పై దులిపితే  పేనులాంటి నల్లటి పురుగులు కనిపిస్తాయని.. వీటి నివారణకు  థయోమిథాగ్జైమ్ 150 గ్రాములు + హెక్సాకొనోజోల్ 1 లీటరు 500 లీటర్ల నీటిలో కలిపి స్ర్పే చేయాలని సూచించారు.  పూత నల్లగా మారడంతో పాటు బూడిద తెగులు, తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే  ఫిప్రోనిల్ 40% + ఇమ్డాక్లో పిరడ్ 40%  డబ్ల్యూజీ పోలీస్150 గ్రాములు + టెబ్యుకోనాజోల్ + ట్రిఫ్లాక్సిస్టోర్బిన్, (నేటివో) 250 గ్రాములు 500లీటర్ల నీటిలో కలిపి స్ర్పే చేయాలన్నారు.  పిందె పసుపు రంగులోకి మారితే 13.0.45.  2.5 కేజీ + ఫార్ములా -4 లేదా ఫార్ములా 6 , -- 2.5 కేజి + ప్లానోఫిక్స్  100 ఎంల్‌‌  500 లీటర్ల నీటిలో కలిపి స్ర్పే చేసుకోవాలని సూచించారు. 

ఎన్ని ప్రయత్నాలు చేసినా.. 

రైతులు పంటను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఫర్టిలైజర్‌‌‌‌ షాప్‌‌ ఓనర్లు సూచించిన మందులన్నీ తీసుకొచ్చి పిచికారీ చేస్తున్నారు.  కొందరు రైతులు వేప నూనె, కషాయాలు లాంటి సేంద్రియ పద్ధతులనూ వాడుతున్నారు. అయినా తెగులు కంట్రోల్ కావడం లేదు. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని, ఉద్యానవన అధికారులు సూచించిన మందులూ పనిచేయడం లేవని అంటున్నారు.  సైంటిస్టులు వచ్చి పరిష్కార మార్గం చూపాలని కోరుతున్నారు.  లేదంటే లాభాలు, రెక్కల కష్టం పక్కనపెడితే అప్పులు , వడ్డీ తీర్చే దారి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.