యూనిసెఫ్‌ గ్లోబల్ ఇన్నొవేషన్​లో ‘బ్లైండ్ ఐ’ ప్రాజెక్ట్

యూనిసెఫ్‌ గ్లోబల్ ఇన్నొవేషన్​లో  ‘బ్లైండ్ ఐ’ ప్రాజెక్ట్
  • అంధుల కోసం పరికరం తయారుచేసిన రవికిరణ్​
  • ఈనెల 24 నుంచి 30 వరకు టర్కీలో సదస్సు

ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు : ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ నవోదయ పూర్వ విద్యార్థి రవికిరణ్  తయారుచేసిన ‘బ్లైండ్ ఐ పరికరం’ ప్రాజెక్టును అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించే అవకాశం వచ్చింది. టర్కీలోని ఇస్తాంబుల్   వేదికగా యూనిసెఫ్  గ్లోబల్  ఇన్నొవేషన్  సమ్మిట్​లో ఈ ప్రాజెక్టును ఆవిష్కరించనున్నారు. ఈనెల 24 నుంచి 30 వరకు 2024గ్లోబల్  ఇంక్యేబేషన్  వీక్  ఫర్  ఇమాజిన్  వెంచర్స్  గ్లోబల్  విన్నర్స్  ఈ సదస్సు జరగనుంది. మన దేశం తరపున రవికిరణ్  ప్రాతినిధ్యం వహించనున్నాడు. 

ఈ మేరకు యూనిసెఫ్  నుంచి ఆహ్వానం అందిందని అతను వెల్లడించాడు. ఆదిలాబాద్  జిల్లా కేంద్రంలోని దస్నాపూర్​కి చెందిన ఆర్టీసీ ఉద్యోగి ప్రేమ్  సింగ్,- కళావతి దంపతుల కొడుకు తగిరే రవికిరణ్.. ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలోని ఏకైక నవోదయ విద్యాలయంలో పదో తరగతి వరకు చదివాడు. ఐదేళ్ల కిందట కాగజ్ నగర్  జవహర్  నవోదయ విద్యాలయంలో క్లాస్ లోని మరో స్టూడెంట్​తో కలిసి ‘బ్లైండ్ ఐ’ పరికరం ప్రాజెక్టు చేపట్టాడు. ఏఐ టెక్నాలజీతో కళ్లజోడులాగా దీన్ని రవికిరణ్ రూపొందించాడు. 

అంధులు ఈ కళ్లజోడు పెట్టుకుని ఇంకొకరి సాయం లేకుండా నడవడంతో పాటు వారి పనులన్నీ చేసుకోవచ్చు. ఈ పరికరం లో ఏర్పాటు చేసిన  సెన్సార్, చిప్​లు.. ఎదురుగా ఉన్న వస్తువుల గురించి అలర్ట్ లు ఇస్తాయి. ఇప్పటికే దీనిని ఎల్వీ ప్రసాద్  ఐ ఇన్ స్టిట్యూట్​లో సైతం ప్రయోగాత్మకంగా పరిశీలించగా మంచి ఫలితాలు వచ్చాయని రవికిరణ్  తెలిపాడు. ఎల్వీ ప్రసాద్ ఇన్ స్టిట్యూట్  నుంచి రూ.2 లక్షల రూపాయల సహకారం కూడా అందిందని చెప్పాడు. 

అలాగే  కేంద్ర  ఎలక్ట్రానిక్స్  మంత్రిత్వశాఖ నుంచి రూ.35 లక్షల ప్రోత్సాహం అందిందని తెలిపాడు. ఈ పరికరం పేటెంట్ కోసం ఇప్పటికే ఏలియన్ ఇన్నొవేషన్ తరపున అప్లయ్  చేశామని వెల్లడించాడు. ఈ పరికరం ధర రూ.8 వేల నుంచి 12 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు.