
- రాజకీయాల కోసమే వ్యతిరేకిస్తున్నరు: కిషన్ రెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు: విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం భాషతో సంబంధం లేకుండా ముందుకెళ్తున్న ప్రస్తుత రోజుల్లో హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో శుక్రవారం రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా దక్షిణ సంవాదం పేరిట నిర్వహించిన కార్యక్రమానికి పవన్‌కల్యాణ్‌తో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్‌సింగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు.
కార్యక్రమంలో పవన్కల్యాణ్మాట్లాడుతూ.. హిందీ నేర్చుకోవడమంటే మన ఉనికిని కోల్పోవడం కాదని, ఇంకో భాషను అంగీకరించడమంటే ఓడిపోవడం కాదని, కలిసి ప్రయాణించడమని అన్నారు. హిందీని వ్యతిరేకిస్తే.. రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేయడమే అవుతుందన్నారు. తెలుగు అమ్మలాంటిది అయితే.. హిందీ భాష పెద్దమ్మ వంటిదన్నారు. మన రాజ్య భాష హిందీని జాతీయ భాషగా తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉందని.. రాష్ట్ర సరిహద్దులు దాటితే మనకు రాజ్య భాష హిందీ అవుతుందన్నారు.
హిందీపై ఓటు బ్యాంకు పాలిటిక్స్..
దేశ ప్రజలతో మాట్లాడేందుకే తాను హిందీ నేర్చుకున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కొందరు మాత్రం రాజకీయాల కోసమే హిందీని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. హిందీ భాషపై ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ‘‘మనమంతా ఒక్కటే. మన రాజ్య భాష హిందీ. తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు వంటివి ఆయా ప్రాంతాలవారికి మాతృభాషలు” అని చెప్పారు.
దక్షిణ భారత ప్రజలు మాతృ భాషతో పాటు హిందీలో మాట్లాడాలని సూచించారు. రష్యా, చైనా, ఇజ్రాయెల్, జపాన్ వంటి దేశాల అధ్యక్షుల అధికారిక సందేశాలు వారి రాజ్య భాషలోనే ఉంటాయని, వారు ఆ భాషలోనే మాట్లాడతారని చెప్పారు. హిందీ చాలా సింపుల్ లాంగ్వేజ్ అని, దేశ ప్రజలను కలిపే భాష అని అన్నారు. దేశంలో హిందీ మాట్లాడని ప్రాంతాలే కనిపించవన్నారు. అయితే, అన్ని భారతీయ భాషలూ ఎంతో సుందరమైనవని కొనియాడారు.