అమ్మకాలు, కొనుగోళ్లతో  చేతులు మారిన భూములు 

అమ్మకాలు, కొనుగోళ్లతో  చేతులు మారిన భూములు 
  • ధరణిలో లక్షల ఎకరాలు బ్లాక్
  • ఎప్పుడో పట్టాలైన సర్కార్ భూములను ఇప్పుడు బ్లాక్ చేస్తున్న ప్రభుత్వం
  • 1952 సేత్వార్ల ఆధారంగా భూములను వెలికితీస్తున్న ప్రభుత్వం 
  • రెగ్యులరైజేషన్ ద్వారా ఆమ్దానీ కోసమే ప్లాన్?  
  • అమ్మకాలు, కొనుగోళ్లతో  చేతులు మారిన భూములు 
  • సర్కారు బ్లాక్ చేస్తుండటంతో పట్టాదారుల ఆందోళన


మంచిర్యాల/చెన్నూర్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా1952 నాటికి రికార్డుల్లో ఉన్న ప్రభుత్వ భూములన్నింటిపైనా సర్కారు నజర్ పెట్టింది. వివిధ కారణాలతో పట్టాలుగా మారిన ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్, పరంపోగు భూముల లెక్కలను తీయిస్తోంది. ఇందుకోసం రెవెన్యూ అధికారులు 70 ఏండ్ల కిందటి ఫైళ్ల దుమ్ము దులుపుతున్నారు. ఇప్పటికే ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చిన అసైన్డ్​భూములకు అదనంగా కొత్తగా గుర్తిస్తున్న భూములను సైతం సర్వే నంబర్లవారీగా ధరణి పోర్టల్​లో కలెక్టర్లు బ్లాక్ చేస్తున్నారు. ఇటీవల ఒక్క మంచిర్యాల జిల్లాలోనే ఇలా 5 వేల ఎకరాలకు పైగా బ్లాక్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాలను బ్లాక్ లిస్టులో చేర్చినట్లు తెలుస్తోంది. ఈ తతంగం మూడు నెలలుగా నడుస్తోంది. ఇన్నాళ్లూ మామూలు భూముల్లాగానే వీటి అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి. ధరణి వచ్చాక కూడా ఒకరి నుంచి ఒకరికి పట్టాలు చేశారు. తీరా ఇప్పుడు బ్లాక్ లిస్టులో పెడ్తున్నట్లు మెసేజ్​లు వస్తుండడంతో లక్షలు పెట్టి భూములు కొన్నవాళ్లు లబోదిబోమంటున్నారు.   

ఆందోళనలో పట్టాదారులు 

1952  నాటి ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్, పరంపోగు భూములు ఆ తర్వాత క్రమంగా పట్టాలుగా మారాయి. అప్పటి ప్రభుత్వాలు 1956 నుంచి 2014 వరకు 13,88,530 మందికి 22,55,617 ఎకరాలను అసైన్డ్ చేశాయి. ఇందులో 2,41,749 ఎకరాలు అసైన్డ్​దారులు ఇతరులకు అమ్ముకున్నట్లు భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా గుర్తించారు. అసైన్డ్ భూములు కొన్నవాళ్లతోపాటు  ప్రభుత్వ, సీలింగ్, పరంపోగు భూములను ఆక్రమించిన వారిలో చాలా మంది పైరవీల ద్వారా పట్టాలు చేసుకున్నారు. మరికొందరికి రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుని భూరికార్డులను మార్చి, పట్టాదారు పాస్​బుక్​లు జారీ చేశారు. ఈ రకంగా ప్రభుత్వ భూములను పట్టాలు చేసుకున్నవాళ్లు తర్వాత వాటిని అమ్ముకున్నారు. అలా పలువురి చేతులు మారి రిజిస్ర్టేషన్లు జరిగాయి. ధరణి పోర్టల్​లోనూ పట్టాలుగా నమోదయ్యాయి. రైతులకు పాస్​బుక్​లు వచ్చాయి. దీంతో వాటిని పట్టా భూములుగా భావించి కొనుగోలు చేసినవాళ్లు ప్రస్తుతం పరేషాన్ అవుతున్నారు. ఉన్నట్టుండి ధరణిలో ట్రాన్సాక్షన్లు నిలిపేయడంతో ఆందోళన చెందుతున్నారు.     

ఆమ్దానీ కోసమేనా?  

ధరణి వచ్చిన తర్వాత ప్రభుత్వం అసైన్డ్​ భూములను ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టింది. అప్పటికే పట్టాలుగా మారిన భూములు ప్రొహిబిటెడ్ లిస్టులో లేవని గుర్తించి ఇప్పుడు బ్లాక్ లిస్టులో చేరుస్తోంది. దీంతో ఈ భూముల అమ్మకాలు నిలిచిపోతున్నాయి. వాటిని పట్టాదారులు అనుభవించడం మినహా అమ్ముకోలేరు. ఇప్పటికే ప్రొహిబిటెడ్​ లిస్టులో పెట్టిన అసైన్డ్​ భూములతో పాటు తాజాగా బ్లాక్ లిస్టులో పెడ్తున్న భూములన్నీ రెగ్యులరైజ్ చేయడం వల్ల ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇండ్ల స్థలాలకు సంబంధించి ఇప్పటికే రాష్ర్టంలో ఇలాంటి స్కీం ఒకటి అమల్లో ఉంది. 2014 జూన్ 2కు ముందు ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నవారికి యాజమాన్యపు హక్కులు కల్పించేందుకు 58, 59 జీవోలను తెచ్చింది. ఇటీవలే రెండోవిడత దరఖాస్తులు స్వీకరించింది. ఇదే రీతిలో అసైన్డ్​ భూములను క్రమబద్ధీకరించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో సంబంధిత సర్వే నంబర్లను ధరణిలో బ్లాక్ చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

బ్లాక్ లిస్టు నుంచి తీయాలె.. 

పిల్లల భవిష్యత్తుకు పనికి వస్తుందని పారుపెల్లి శివారులోని 175/3 సర్వే నంబర్​లో రూ.10 లక్షల చొప్పున ఎకరం గుంట భూమి కొన్నం. మాకు పట్టా పాస్​బుక్, పహాణీ, ప్రొసీడింగ్ పత్రాలు అన్నీ ఉన్నయి. రైతుబంధు కూడా వస్తోంది. బ్యాంకులో లోను కూడా తీసుకున్నం. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ మా భూమిని ఇప్పుడు బ్లాక్ చేసిన్రు. మీరు అనుభవించవచ్చు కానీ ఇతరులకు అమ్మరాదని చెప్తున్నరు. ఈ భూమి మేము కొనడానికి ముందు చాలామంది చేతులు మారింది. ఇప్పుడు భూమి అమ్మరాదంటే మా పిల్లల చదువులు ఆగిపోతయి. సర్కారు ఆలోచించి మా భూమిని బ్లాక్ లిస్టు నుంచి తీయాలె.  - నామని స్వరూపారాణి, పారుపెల్లి, మంచిర్యాల జిల్లా

నా బిడ్డకు, అల్లునికి ఏమని చెప్పాలె?  

నా బిడ్డ, అల్లుడు అమెరికాలో జాబ్ చేస్తున్నరు. బిడ్డ కోసం చెన్నూర్ మండలం కోనంపేటలోని సర్వే నంబర్​ 14లో రెండెకరాల 17 గుంటలు కొన్నం. రూ.30 లక్షలు అయ్యింది. నిరుడు అక్టోబర్ 4న నా పేరు మీద పట్టా చేసుకున్న. అప్పుడు ప్రొహిబిటెడ్​లిస్టులో లేదు. కొత్త పాస్​బుక్ వచ్చింది. ఈ నెల 11న నా ​ఫోన్​కు మా సర్వే నంబర్​ను బ్లాక్ చేసినట్టు మెసేజ్ వచ్చింది. రెవెన్యూ ఆఫీసర్లను అడిగితే గతంలో అది సర్కారు భూమి అని, అందుకే బ్లాక్ చేసినట్లు చెప్పిన్రు. ఇతరులకు అమ్మరాదని అంటు న్నరు. ఇప్పుడు మా బిడ్డ, అల్లునికి ఏం సమాధానం చెప్పాల్నో తెలుస్తలేదు.  

‑ కుంభం తిరుమల, భూపాలపల్లి

అమ్మడానికి వీల్లేదు..


ఇప్పుడు బ్లాక్ చేసిన ల్యాండ్స్ 1952 సేత్వార్ ప్రకారం ప్రభుత్వ భూములని తేలింది. ప్రస్తుత పట్టాదారు ఆ భూములను అనుభవించ డానికి హక్కులు ఉంటాయి. కానీ అమ్మడానికి వీల్లేదు. భూములను కొనేముందు చూసుకోవాలె. ప్రభుత్వ భూమి తక్కువ ధరకు వస్తుందని కొంటే ఇబ్బందులు తప్పవు.   

- శ్రీనివాసరావు దేశ్​పాండే, చెన్నూర్ తహసీల్దార్